YSRCP: వైసీపీ కార్యకర్తల సమన్వయకర్తగా పుత్తా ప్రతాప్ రెడ్డి నియామకం
- కడప జిల్లాకు చెందిన పుత్తా ప్రతాప్ రెడ్డి
- హైదరాబాద్లోని ఎల్బీ నగర్ కేంద్రంగా రాజకీయాలు
- వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడిచిన నేత
- 2014లో ఎల్బీ నగర్ అసెంబ్లీ అభ్యర్థిగానూ నామినేషన్ వేసిన వైనం
ఏపీలో అధికార పార్టీ వైసీపీలో బుధవారం మరో కీలక నియామకం జరిగింది. పార్టీ కార్యకర్తల సమన్వయకర్తగా కడప జిల్లాకు చెందిన పుత్తా ప్రతాప్ రెడ్డి నియమితులయ్యారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కార్యకర్తల సమన్వయకర్తగా ప్రతాప్ రెడ్డిని నియమిస్తున్నట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
కడప జిల్లాకు చెందిన పుత్తా ప్రతాప్ రెడ్డి హైదరాబాద్లో స్థిరపడ్డారు. నగరంలోని ఎల్బీ నగర్లో ఆయనకు రాజకీయంగా మంచి పట్టు ఉంది. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే కొనసాగిన ఆయన 2014 ఎన్నికల్లో ఎల్బీ నగర్ అసెంబ్లీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. కాలక్రమంలో తెలంగాణలో వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా... ప్రతాప్ రెడ్డి కూడా నగర రాజకీయాల నుంచి దూరంగా జరిగారు.