Meteorological department: రేపు ఏపీలోని ఆరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం
- రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా వానలు పడతాయన్న వాతావరణ శాఖ
- ఎక్కడెక్కడ ఎంతెంత వాన పడొచ్చనే మ్యాప్ ను పోస్ట్ చేసిన ఏపీ విపత్తు నిర్వహణ శాఖ
- నాలుగు జిల్లాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వానలు కురుస్తాయని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో ఆగస్టు 4వ తేదీన (గురువారం) విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ రాష్ట్ర వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయని వెల్లడించింది. చిత్తూరు, తిరుపతి, వైఎస్సార్, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం తదితర ఆరు జిల్లాల్లో భారీగా వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇందులో శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో మినహా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు పడతాయని వెల్లడించింది. ఈ మేరకు వివరాలను ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ బుధవారం ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. ఏయే ప్రాంతాల్లో ఎంతెంత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందనే వివరాలతో కూడిన మ్యాప్ ను కూడా జత చేసింది.