Telangana: దళిత బంధు నిధులతో క్యారీ బ్యాగ్ పరిశ్రమ... పథకం సత్ఫలితాలిస్తోందన్న వినోద్ కుమార్
- హుజూరాబాద్ ఉప ఎన్నికల ముందు ప్రారంభమైన దళిత బంధు
- పథకం కింద లబ్ధిదారుడికి రూ.10 లక్షలు ఇస్తున్న ప్రభుత్వం
- ఈ పథకం నిధులతో హుజూరాబాద్ పరిధిలో ప్రారంభమైన క్యారీ బ్యాగ్ తయారీ పరిశ్రమ
- యూనిట్‌ను పరిశీలించిన తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్
తెలంగాణలో దళితుల సర్వతోముఖాభివృద్ధి కోసం టీఆర్ఎస్ సర్కారు దళిత బంధు పేరిట ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. హుజూరాబాద్ ఉప ఎన్నికలకు కాస్తంత ముందుగా ప్రకటించిన ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా పలువురు దళితులకు ఈ పథకాన్ని అందజేశారు. ఈ పథకం కింద ఆయా లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.10 లక్షలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిధులతో దళితులు తమకు ఇష్టం వచ్చిన వ్యాపారాన్ని మొదలుపెట్టే అవకాశం ఉంది.
దళిత బంధు పథకం అమలు తీరును పరిశీలించేందుకు తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ బుధవారం హుజూరాబాద్‌లో పర్యటించారు. పార్టీ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిని వెంటబెట్టుకుని ఆయన దళిత బంధు నిధులతో ఏర్పాటైన క్యారీ బ్యాగ్ తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. ఆ కేంద్రం విజయవంతంగా నడుస్తున్న తీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత బంధు పథకం సత్ఫలితాలిస్తోందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని పేర్కొన్నారు.