Kinjarapu Ram Mohan Naidu: నా విన్నపం మేరకు కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి స్పందించారు: రామ్మోహన్ నాయుడు
- శ్రీకాకుళంలో దివ్యాంగులు, వృద్ధులను గుర్తించేందుకు ఆదేశించారన్న రామ్మోహన్ నాయుడు
- గత ఏడాది 2,638 మందికి పరికరాలను అందించామని వివరణ
- అప్పట్లో కొంత మంది శిబిరానికి హాజరు కాలేకపోయారని వెల్లడి
తన అభ్యర్థన మేరకు శ్రీకాకుళంలో దివ్యాంగులను, వృద్ధులను గుర్తించేందుకు శిబిరాన్ని నిర్వహించేందుకు కేంద్ర సామాజిక న్యాయ మంత్రి సానుకూలంగా స్పందించారని... శిబిరాన్ని నిర్వహించాలని అధికారులను ఆదేశించారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలిపారు.
2021 జులైలో 2,638 మందికి రూ. 2.9 కోట్ల విలువైన పరికరాలను అందజేశారని... అందులో రూ. 30 లక్షల తన ఎంపీ లాడ్స్ నిధులు కూడా ఉన్నాయని చెప్పారు. 2021లో జరిగిన ఈ గుర్తింపు శిబిరానికి కొంతమంది అనివార్య కారణాల వలన హాజరుకాలేదని... అటువంటి వారు కొన్ని వందల సంఖ్యలో ఉండటంతో వారందరి కోసం జిల్లాలో మరోసారి గుర్తింపు శిబిరాన్ని నిర్వహించాలని తాను కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ గారిని అభ్యర్ధించానని... తన విన్నపం మేరకు వారు శిబిరాన్ని నిర్వహించాలంటూ అధికారులను ఆదేశించారని చెప్పారు.