AAP: గుజరాత్ బీజేపీ సీఎం అభ్యర్థిగా అమిత్ షా?.. రూమర్ నిజమేనా? అంటూ ఆప్ ట్వీట్!
- గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సమీపిస్తున్న గడువు
- రాష్ట్రంలో తాము వృద్ధి చెందుతున్నామన్న ఆప్
- తమను ఎలా అడ్డుకోవాలో తెలియక బీజేపీ అయోమయానికి గురవుతోందని సెటైర్
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ.. ఆ రాష్ట్రంలోని అధికార పార్టీ బీజేపీపై ఆమ్ ఆద్మీ పార్టీ గురువారం సోషల్ మీడియా వేదికగా ఓ సెటైర్ సంధించింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిగా కేంద్ర హోం శాఖ మంత్రిని ఖరారు చేసినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయన్న ఆప్... ఈ వార్త నిజమేనా? అంటూ తన ట్వీట్లో బీజేపీని ప్రశ్నించింది.
ప్రస్తుతం గుజరాత్ సీఎంగా కొనసాగుతున్న భూపేంద్ర పటేల్ నాయకత్వంపై బీజేపీ అసంతృప్తిగా ఉందని తెలుస్తోందని, ఈ మాట కూడా నిజమేనా? అంటూ భూపేంద్రను ప్రశ్నించింది. మరో అడుగు ముందుకేసిన ఆప్...గుజరాత్లో నానాటికీ బలోపేతమవుతున్న తమను చూసి భయపడుతోందని కూడా వ్యాఖ్యానించింది. మొత్తంగా తమ దినదినాభివృద్ధిని ఎలా అడ్డుకోవాలో అర్థం కాక బీజేపీ తల పట్టుకుందని ఆప్ కామెంట్ చేసింది.