Lakshmi Parvati: ఉమామహేశ్వరి మరణానికి చంద్రబాబే కారణమన్న అనుమానాలు కలుగుతున్నాయి: లక్ష్మీపార్వతి
- ఆస్తిగొడవలంటూ ప్రచారం జరుగుతోందన్న లక్ష్మీపార్వతి
- ఉమామహేశ్వరి మృతి ఓ మిస్టరీలా ఉందని వ్యాఖ్య
- సీబీఐ విచారణ కోరుతూ చంద్రబాబు లేఖ రాయాలని డిమాండ్
- లేకపోతే తానే రాస్తానని స్పష్టీకరణ
నందమూరి తారకరామారావు చిన్నకుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం సృష్టించింది. దీనిపై తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి స్పందించారు. ఈ వ్యవహారంలో చంద్రబాబుపై అనుమానాలు కలుగుతున్నాయని ఆమె అన్నారు. ఉమామహేశ్వరి నివాసానికి చంద్రబాబు వచ్చాకే అక్కడి సూసైడ్ నోట్ మాయమైందని తెలిపారు.
ఆమె మృతి వ్యవహారం ఓ మిస్టరీలా ఉందని, దీనిపై సీబీఐ విచారణ కోరుతూ చంద్రబాబు లేఖ రాయాలని లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు. చంద్రబాబు రాయకపోతే తానే సీబీఐకి లేఖ రాస్తానని స్పష్టం చేశారు. ఉమామహేశ్వరి బాగా చదువుకున్న వ్యక్తి అని, ఆత్మహత్యకు పాల్పడేంత పిరికితనం ఎన్టీఆర్ కుటుంబంలో లేదని అన్నారు.
అయితే, ఉమామహేశ్వరితో చంద్రబాబు, లోకేశ్ ఆస్తికోసం గొడవ పడుతున్నారని, అందుకే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రచారం జరుగుతోందని లక్ష్మీపార్వతి వెల్లడించారు. సూసైడ్ నోట్ కనిపించకుండా పోవడం అనుమానాలను మరింత బలపరుస్తోందని తెలిపారు.
ఎన్టీఆర్ మృతికి కారకుడైన చంద్రబాబును నమ్మి మోసపోతున్న నందమూరి కుటుంబీకులను చూస్తే బాధ కలుగుతోందని అన్నారు. ఎన్టీఆర్ కుటుంబానికి పట్టిన శని చంద్రబాబు అని అభివర్ణించారు. హరికృష్ణ మరణానికి కూడా చంద్రబాబే కారకుడని ఆరోపించారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను ఒక్కొక్కరినే బలి తీసుకుంటున్నాడని మండిపడ్డారు.
కోడెల శివప్రసాదరావు సైతం చంద్రబాబు వల్లే మరణించాడని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేసిన మోసాలను కోడెల ఫోన్ లో రికార్డు చేసుకున్నారని, అయితే, కోడెలను దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి కాకుండా దూరంగా ఉన్న బసవతారకం ఆసుపత్రికి తరలించారని, ఆయన ఫోన్ ను మాయం చేశారని లక్ష్మీపార్వతి ఆరోపించారు.
అటు, జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకుని వదిలేశారని వెల్లడించారు. కొడుకు కోసం ఎన్టీఆర్ ను దూరం పెట్టారని, ఆఖరికి ఎన్టీఆర్ సినిమాలకు కూడా అడ్డుపడ్డారని ఆరోపించారు. చంద్రబాబు ఇకనైనా ఎన్టీఆర్ కుటుంబాన్ని వీడాలని, బాలకృష్ణకు బాధ్యతలు అప్పగించాలని స్పష్టం చేశారు.