Taiwan: ఎప్పుడూ ఉత్తర కొరియా చేసే పని ఇప్పుడు చైనా చేస్తోంది: తైవాన్
- తైవాన్ లో నాన్సీ పెలోసీ పర్యటన
- తైవాన్ జలసంధిపై చైనా క్షిపణుల వర్షం
- ఉత్తర కొరియా కూడా ఇంతేనన్న తైవాన్ విదేశాంగ శాఖ
- ఎప్పుడూ సముద్రంలో పడేలా క్షిపణులు ప్రయోగిస్తుందని వెల్లడి
అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చైనా ఏకంగా 11 బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించడం తెలిసిందే. ఈ క్షిపణులు తైవాన్ చుట్టూ ఉన్న సముద్ర జలాల్లో పడ్డాయి. దీనిపై తైవాన్ విమర్శనాత్మక ధోరణిలో స్పందించింది. ఉత్తర కొరియా ఎప్పుడూ చేసే పనే చైనా ఇప్పుడు చేస్తోందని ఎద్దేవా చేసింది.
తైవాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, పొరుగు దేశాల సముద్ర జలాల్లో పడేలా కావాలనే క్షిపణులను ప్రయోగించడం ఉత్తర కొరియాకు అలవాటని వివరించింది. ఇప్పుడు చైనా కూడా ఉత్తర కొరియాను ఉదాహరణగా తీసుకుని సముద్రంలోకి క్షిపణులు సంధిస్తోందని వెల్లడించింది.
నిత్యం వాణిజ్య నౌకలతో రద్దీగా ఉండే తైవాన్ జలసంధిని లక్ష్యంగా చేసుకుని ఇవాళ చైనా బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. సైనిక విన్యాసాల పేరిట నిర్వహించిన ఈ క్షిపణి ప్రయోగాలు తైవాన్, అమెరికాలను రెచ్చగొట్టేందుకేనని స్పష్టమవుతోంది.
చైనా క్షిపణి ప్రయోగాలతో వాణిజ్యనౌకలకు, పలు రూట్లలో విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. అనేక వాణిజ్య నౌకలు తమ దిశను మార్చుకోవాల్సి వచ్చింది. తైవాన్ లోని తాయోయున్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 50కి పైగా అంతర్జాతీయ విమానాలను రద్దు చేశారు.