Telangana: తెలంగాణలో నేడు పలు జిల్లాల్లో కుంభవృష్టి .. రేపు అతి భారీ వర్షాలు: వాతావరణశాఖ
- 7-9 మధ్య కూడా అత్యంత భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ
- ప్రభుత్వానికి, ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సమాచారం ఇచ్చిన వాతావరణ శాఖ
- ఉరుములు, మెరుపులతో పాటు బలంగా వీయనున్న గాలులు
తెలంగాణలో నేడు, రేపు పలు ప్రాంతాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే, ఈ నెల 7-9 మధ్య కూడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏడో తేదీన 12 నుంచి 20 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, 8, 9 తేదీల్లో అంతకుమించి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రభుత్వానికి, జాతీయ విపత్తు నిర్వహణ బృందాలకు (NDRF) సమాచారం ఇచ్చినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే, 7న లేదంటే ఆ తర్వాత వాయవ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.