TRS: విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థికే టీఆర్ఎస్ మద్దతు.. రేపే పోలింగ్!
- మార్గరెట్ ఆల్వాకే మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ అధినేత, కేసీఆర్ నిర్ణయం
- ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ
- టీఆర్ఎస్ లోక్ సభ, రాజ్యసభ సభ్యులు కలిపి 16 మంది ఎంపీలు ఈ మేరకు ఓటు వేయాలని సూచన
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ ఆల్వాకే మద్దతు ఇస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి మార్గరెట్ ఆల్వాకు మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించారని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు వెల్లడించారు. టీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ, లోక్ సభ సభ్యులు కలిపి మొత్తం 16 మంది ఇందుకు అనుగుణంగా ఓటు వేయాలని ఆదేశించారు.
మొత్తం 788 మంది ఎంపీలు..
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10వ తేదీన పూర్తికానుంది. ఈ మేరకు ఉప రాష్ట్రపతి ఎన్నికలకు ఆగస్టు 6న పోలింగ్ జరుగనుంది. ఇందులో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే తరఫున జగదీప్ ధన్ కర్ పోటీ చేస్తుండగా.. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వా బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో లోక్ సభ, రాజ్యసభ సభ్యులు మొత్తం 788 మంది ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.