cheruku sudhakar: కాంగ్రెస్ లో చెరుకు సుధాకర్ చేరిక.. ఇక రేవంత్ ముఖం చూడబోనన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి!

Cheruku sudhakar Joins Congress Mp komatireddy venkatreddy fires on Revanth

  • చెరుకు సుధాకర్ ఆధ్వర్యంలోని తెలంగాణ ఇంటి పార్టీ కాంగ్రెస్ లో విలీనం
  • ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే సమక్షంలో పార్టీలో చేరిన చెరుకు సుధాకర్
  • తనను ఓడించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని చేర్చుకుంటారా అంటూ వెంకటరెడ్డి ఆగ్రహం

తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన ఆధ్వర్యంలోని తెలంగాణ ఇంటి పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిల సమక్షంలో చెరుకు సుధాకర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా చెరుకు సుధాకర్ కు స్వాగతం పలుకుతున్నట్టు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేస్తూ, ‘‘ప్రజల పక్షాన ప్రజల గళంగా నిలిచి.. దోపిడీ  నియంతలతో అను నిత్యం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీకి మీ చేరిక మరింత బలం చేకూరుతుందని ఆశిస్తున్నాము" అంటూ పేర్కొంది.

సాదరంగా స్వాగతిస్తున్నానన్న రేవంత్
‘‘కాంగ్రెస్‌లో తెలంగాణ ఇంటి పార్టీ విలీనమైంది. స్వరాష్ట్ర ఆకాంక్షే తప్ప స్వలాభాపేక్ష లేని నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్య‌క్షుడు చెరుకు సుధాకర్ శుక్రవారం మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు సాదరంగా స్వాగతం పలుకుతున్నాను..” అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్
చెరుకు సుధాకర్ గత ఎన్నికల్లో తనను ఓడించేందుకు ప్రయత్నించారని.. అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం ఏమిటని ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. ఈ విషయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. చెరుకు సుధాకర్ ను చేర్చుకునే విషయంలో రేవంత్ రెడ్డి తప్పు చేశారని.. ఇకపై తాను రేవంత్ రెడ్డి ముఖం చూడబోనని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News