Paytm: 3 గంటల పాటు నిలిచిన పేటీఎం సేవలు... సాంకేతిక కారణాలేనన్న సంస్థ
- శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి నిలిచిన పేటీఎం సేవలు
- వినియోగదారుల నుంచి వెల్లువెత్తిన ఫిర్యాదులు
- 12 గంటలకు తిరిగి పునరుద్ధరణ అయిన వైనం
ఆన్‌లైన్ పేమెంట్స్‌లో దిగ్గజ సంస్థగా ఎదిగిన పేటీఎం శుక్రవారం వినియోగదారులకు చుక్కలు చూపించింది. నేటి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా పేటీఎం సేవలు స్తంభించాయి. దీంతో పేటీఎం వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ అసౌకర్యంపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో పేటీఎం సంస్థ ఆ తర్వాత సమస్యను పరిష్కరించింది.
శుక్రవారం ఉదయం పేటీఎం ద్వారా చెల్లింపులు చేసేందుకు వినియోగదారులు యాప్‌ను ఓపెన్ చేయగా... సాంకేతిక సమస్యలు కనిపించాయి. పేటీఎం ఓపెన్ అయినా... చెల్లింపులు కాలేదు. చెల్లింపులకు అనుమతి ఇచ్చిన వెంటనే పేటీఎం దానికదే లాగౌట్ అయ్యింది. ఆ తర్వాత తిరిగి లాగిన్ అవుదామని యత్నించిన వినియోగదారులకు నిరాశే ఎదురైంది.
దీంతో వినియోగదారులు పెద్ద ఎత్తున పేటీఎంకు ఫిర్యాదులు చేశారు. దీంతో అప్పటికప్పుడు రంగంలోకి దిగిన పేటీఎం బృందం తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరించింది. ఆ తర్వాత సాంకేతిక సమస్య కారణంగానే అవాంతరం తలెత్తిందని, సమస్యను పరిష్కరించినట్లు వినియోగదారులకు తెలిపింది.