Rare Elephant: మయన్మార్ లో తెల్ల ఏనుగు.. ఎంతో పవిత్రమైనదంటూ వీడియో విడుదల చేసిన ఆ దేశ ప్రభుత్వం!
- తెల్ల ఏనుగుకు స్నానం చేయిస్తూ, తల్లి పాలు తాగుతూ ఉన్న వీడియోల విడుదల
- ఆ ఏనుగు ప్రత్యేకతలను వివరిస్తూ పోస్టు.. ఇంటర్నెట్ లో వైరల్
- మయన్మార్ నియంతృత్వ ప్రభుత్వ తీరుతో భిన్నమైన కామెంట్లు
సాధారణంగా ఏనుగులు నలుపు రంగులోనో, ముదురు గోధుమ రంగులోనో ఉంటాయి. తెల్ల ఏనుగులు ఉండటం అత్యంత అరుదు. ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్కృతులలో ఏనుగులను పవిత్రంగా భావిస్తుంటారు. అందులోనూ తెల్ల ఏనుగులైతే మరింత ప్రత్యేకంగా చూస్తారు. ఈ నేపథ్యంలోనే తమ దేశంలో అరుదైన తెల్ల ఏనుగు పుట్టిందని మయన్మార్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. మయన్మార్ లోని పశ్చిమ రఖినే ప్రాంతంలో ఉన్న టౌంగప్ నగరంలో తెల్ల ఏనుగు జన్మించిందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా 30లోపే తెల్ల ఏనుగులు ఉన్నట్టు అంచనా.
స్నానం చేయిస్తూ వీడియోలు..
ఈ మేరకు మయన్మార్ ప్రభుత్వ టీవీ చానల్, పత్రికల్లో వీడియోలు, ఫొటోలను ప్రచురించింది. ఓ సరస్సులో తల్లి ఏనుగు, తెల్ల పిల్ల ఏనుగులకు స్నానం చేయిస్తుండగా.. పిల్ల ఏనుగు పాలు తాగుతుండగా వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టింది. ఈ తెల్ల ఏనుగు పిల్ల రెండున్నర అడుగుల ఎత్తు, 80 కిలోల బరువు ఉందని అధికారులు తెలిపారు. ఈ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఎన్నో ప్రత్యేకతలతో..
మయన్మార్ లో బౌద్ధ మతాన్ని ఆచరించే ప్రజలు ఎక్కువ. బౌద్ధులు తెల్ల ఏనుగులను అత్యంత పవిత్రమైనవని చెబుతారు. ఈ క్రమంలో ఏనుగు ప్రత్యేకతలను, పవిత్రంగా భావించే అంశాలను ఆ దేశ వార్తా సంస్థలు వెల్లడించాయి. ‘‘ముత్యం రంగులో కళ్లు, అరటిబోదెల వంటి వెనుక భాగం, తిన్నగా ఉన్న తోక, తెల్లని వెంట్రుకలు, చర్మంపై పవిత్రమైన చిహ్నాలు, ముందు కాళ్లకు ఐదు చొప్పున, వెనుక కాళ్లకు నాలుగు చొప్పున గోర్లు, పెద్ద చెవులు ఉన్నాయి. ఇవన్నీ పవిత్ర ఏనుగు లక్షణాలు..’’ అని పేర్కొన్నాయి. మయన్మార్‌లో ప్రస్తుతం ఆరు తెల్ల ఏనుగులు ఉన్నట్టు తెలిపాయి.
రాజుల కాలం నుంచీ..
- ఆసియా దక్షిణ, తూర్పు ప్రాంత దేశాల్లోని దాదాపు అన్ని సంస్కృతుల్లో తెల్ల ఏనుగులను అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. పూర్వకాలంలో ఈ ప్రాంతాల్లోని రాజులు వీలైనంత మేరకు ఎక్కడ తెల్ల ఏనుగు కనిపించినా.. తెచ్చి తమ కోటలో పెట్టుకుని, భద్రంగా చూసుకునేవారు. ఈ ఏనుగులతో అదృష్టం, సంపద కలిసి వస్తాయని భావించేవారు.
- రాజులకు ఉండే ఈ అలవాటు కారణంగా కొందరు ఎక్కువ సంఖ్యలో తెల్ల ఏనుగులను తెచ్చి పెంచుకునేవారు. వాటి పోషణ కోసం అయ్యే ఖర్చును భరించలేని పరిస్థితి కూడా ఉండేది. ఈ నేపథ్యంలోనే ఏదైనా భరించలేని ఖర్చులను, మోయలేకుండా ఉండే భారాన్ని తెల్ల ఏనుగులతో పోల్చడం పరిపాటిగా మారింది.
మయన్మార్ తీరుతో భిన్నమైన కామెంట్లు..
- మయన్మార్ దేశంలో ఇటీవల మిలటరీ తిరుగుబాటు, ముస్లింలపై ఊచకోత వంటి ఘటనల నేపథ్యంలో.. మయన్మార్ అధికారిక పత్రిక, చానల్ పెట్టిన ‘తెల్ల ఏనుగు’ వీడియోలపై భిన్నమైన కామెంట్లు వస్తున్నాయి.
- ‘ఇప్పుడా పూర్ ఎలిఫెంట్ జైలుకు వెళ్లాల్సి వస్తుందేమో..’ అని ఓ వ్యక్తి వ్యాఖ్యానించారు. ‘మయన్మార్ దెబ్బకు నాకు అసలు రంగులే కనబడటం లేదు..ఎలా?’ అని ఒక నెటిజన్ ప్రశ్నిస్తే.. ‘ఏనుగులు కేవలం ఎప్పుడో పాత కాలంలో ముఖ్యం. ఇప్పుడెందుకీ ప్రచారం?’ అని మరో నెటిజన్ పేర్కొన్నారు.