Congress: అమిత్ షాతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ
- దాసోజు లాంటి మేధావిని వెళ్లగొడుతున్నారన్న వెంకట్ రెడ్డి
- తననూ వెళ్లగొట్టే యత్నాలు చేస్తున్నారని ఆవేదన
- మునుగోడు ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారో తెలుసన్న ఎంపీ
తెలంగాణ రాజకీయాల్లో శుక్రవారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి... బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వెంకట్ రెడ్డి అమిత్ షాను కలిసిన కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. అదే సమయంలో తాను కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దాసోజు శ్రావణ్ లాంటి మేధావిని పార్టీ నుంచి వెళ్లగొడుతున్నారని, తనను కూడా పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో జరగనున్న మునుగోడు ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారో తనకు తెలుసునని ఆయన అన్నారు. తనకు తెలియకుండానే తన నియోజకర్గ పరిధిలో కాంగ్రెస్ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించిన వెంకట్ రెడ్డి... చెరుకు సుధాకర్ కాంగ్రెస్లో చేర్చుకుంటున్న విషయాన్ని తనకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.