Partha Chatterjee: టీచర్స్ రిక్రూట్ మెంట్ స్కాం: పార్థ చటర్జీ, అర్పిత ముఖర్జీలకు కోర్టులో చుక్కెదురు

Court denies bail to Partha Chatterjee and Arpitha Mukherjee

  • బెంగాల్ లో సంచలనం సృష్టించిన కుంభకోణం
  • జులై 23న మాజీ మంత్రి పార్థ చటర్జీ
  • ఆయన సన్నిహితురాలిని కూడా అదుపులోకి తీసుకున్న ఈడీ
  • తాజాగా బెయిల్ నిరాకరణ.. ఇరువురికి 14 రోజుల కస్టడీ

పశ్చిమ బెంగాల్ లో సంచలనం సృష్టించిన ఉపాధ్యాయ నియామకాల కుంభకోణంలో మాజీ మంత్రి పార్థ ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీలకు కోల్ కతాలోని ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది. వారి బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చింది. వారిద్దరికీ 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. 

ఈ కేసులో ఇంకా విచారణ చేయాల్సి ఉందని, నిందితులిద్దరినీ మరో రెండు వారాల పాటు కస్టడీకి అప్పగించాలని ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) ఇవాళ వాదనలు వినిపించింది. ఈడీ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ఇక్కడి పీఎంఎల్ఏ కోర్టు న్యాయమూర్తి జిబోన్ ముఖర్జీ నిందితులకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. తదుపరి విచారణను ఆగస్టు 18కి వాయిదా వేశారు. 

టీచర్స్ రిక్రూట్ మెంట్ స్కాంలో ఈడీ పార్థ చటర్జీ, అర్పిత ముఖర్జీలను జులై 23న అరెస్ట్ చేసింది. అప్పటినుంచి వారిద్దరూ రిమాండ్ లో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి అర్పిత ముఖర్జీ నివాసాల నుంచి ఇప్పటివరకు రూ.49.80 కోట్ల నగదు, నగలు, బంగారు కడ్డీలు స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ వెల్లడించింది. 

ఇవేకాక ఆస్తులకు సంబంధించిన పత్రాలు, ఇరువురు కలిసి నడిపిస్తున్న ఓ కంపెనీ తాలూకు పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు వివరించింది. పార్థ ఛటర్జీ, అర్పిత ముఖర్జీలపై ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అభియోగాలు మోపింది.

  • Loading...

More Telugu News