Vice President: రేపే ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్... ఫలితం కూడా రేపే
- ఓటింగ్‌లో పాల్గొననున్న పార్లమెంటు ఉభయ సభల సభ్యులు
- ఎన్డీఏ అభ్యర్థిగా బరిలోకి దిగిన జగదీప్ ధన్కర్
- విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మార్గరెట్ అల్వా పోటీ
- ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
భారత ఉపరాష్ట్రపతి పదవి కోసం జరుగుతున్న ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ రేపు (శనివారం) జరగనుంది. పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు ఈ పోలింగ్‌లో పాల్గొననున్నారు. పార్లమెంటు భవనం మొదటి అంతస్తులోని 63వ నెంబరు గదిలో ఈ పోలింగ్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 10 గంటలకు మొదలు కానున్న పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టనున్న ఎన్నికల సంఘం రాత్రికి ఫలితాన్ని వెల్లడించనుంది.
ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌లో పార్లమెంటు ఉభయ సభలకు చెందిన మొత్తం 790 మంది ఎంపీలు ఓటు వేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఉభయ సభల్లో రెండు స్థానాలు ఖాళీగా ఉన్న నేపథ్యంలో రేపటి ఉపరాష్ట్రపతి పోలింగ్‌కు 788 మందికి మాత్రమే ఓటు హక్కు వుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ అభ్యర్థిగా జగదీప్ ధన్కర్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మార్గరెట్ అల్వా పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.