Hyderabad: తుపాకితో బల్లుల్ని కాల్చిన వ్యక్తి.. గురితప్పి బాలుడి వీపులోకి దూసుకెళ్లిన వైనం: పాతబస్తీలో ఘటన
- ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
- మూడు ఆసుపత్రుల్లో చికిత్స చేయించిన వైనం
- కోలుకున్న బాలుడు.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఎయిర్ పిస్టల్‌తో ఇంట్లోని బల్లులను కాలుస్తుండగా ఓ తూటా గోడకు తగిలి అంతే వేగంతో వెనక్కి వచ్చి ఆడుకుంటున్న బాలుడి వీపులోకి దూసుకెళ్లింది. హైదరాబాద్ శివారులోని మొఘల్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. సుల్తాన్‌షాహీకి చెందిన మహ్మద్ అబ్దుల్ అప్సర్ (30) ఈ నెల 1న మధ్యాహ్నం ఎయిర్ పిస్టల్‌ను ప్రాక్టీస్ చేస్తూ ఇంట్లోని గోడపై ఉన్న బల్లులను కాల్చ సాగాడు. ఈ క్రమంలో ఓ బుల్లెట్ గోడకు తగిలి దాని ముక్క వరండాలో ఆడుకుంటున్న పక్కింటి బాలుడి (9) వీపులోకి దూసుకెళ్లింది.
బాలుడికి వెంటనే స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించిన అప్సర్.. అనంతరం చిన్నారిని బంజారాహిల్స్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ నెల 3న అక్కడి నుంచి బహదూర్‌పురాలోని మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కోలుకున్న అనంతరం నిన్న బాలుడు ఇంటికి చేరుకున్నాడు. బాలుడి తండ్రి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.