Bangladesh: లుంగీతో వచ్చిన వ్యక్తికి టికెట్ నిరాకరించిన సినిమా థియేటర్ యాజమాన్యం.. నిరసనగా లుంగీలతో వెళ్లిన ప్రేక్షకులు
- బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘటన
- ‘పోరన్’ సినిమా చూసేందుకు వచ్చిన సర్కార్ అనే వ్యక్తికి టికెట్ నిరాకరణ
- సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన ‘స్టార్ సినీప్లెక్స్’
- సర్కార్ కుటుంబ సభ్యులను సినిమా చూసేందుకు ఆహ్వానించిన వైనం
- వారితో కలిసి సినిమా చూసిన ‘పోరన్’ నటుడు
లుంగీతో సినిమా చూసేందుకు వచ్చిన వ్యక్తికి టికెట్ నిరాకరించిందో థియేటర్ యాజమాన్యం.. విషయం తెలిసిన పలువురు ప్రేక్షకులు లుంగీలు కట్టుకుని థియేటర్‌కు వచ్చి నిరసన తెలపడంతో దిగొచ్చిన యాజమాన్యం.. క్షమాపణలు తెలిపింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిందీ ఘటన.
సమన్ అలీ సర్కార్ అనే సినీ అభిమాని స్టార్ సినీప్లెక్స్ థియేటర్‌లో ‘పోరన్’ సినిమా చూసేందుకు వెళ్లారు. లుంగీతో వచ్చిన ఆయనను చూసి టికెట్ ఇచ్చేందుకు థియేటర్ సిబ్బంది నిరాకరించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆయనకు సంఘీభావంగా మరికొంతమంది లుంగీలు కట్టుకుని థియేటర్‌కు వచ్చి నిరసన తెలిపారు.
దీంతో దిగొచ్చిన స్టార్ సినీప్లెక్స్ ఈ ఘటనపై వివరణ ఇచ్చింది. లుంగీ కట్టుకొచ్చాడన్న కారణంతో వివక్ష చూపబోమని స్పష్టం చేసింది. అలాంటి విధానాలను తాము అనుసరించబోమని పేర్కొంది. జరిగిన ఘటనకు చింతిస్తున్నట్టు తెలిపింది. సమన్ అలీ సర్కార్ తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే ఈ ఘటన జరిగిందని తెలిపింది.
అంతేకాదు, సర్కార్‌తోపాటు ఆయన కుటుంబాన్ని సినిమా చూసేందుకు అదే థియేటర్‌కు ఆహ్వానించింది. అందుకు సంబంధించిన ఫొటోలను తన అధికారిక ఫేస్‌బుక్‌లో పంచుకుంది. మరో విశేషం ఏమిటంటే, ‘పోరన్’ సినిమా నటుల్లో ఒకరైన సరిల్‌పురి రాజ్ కూడా వారితో కలిసి సినిమా చూడడం జరిగింది.