Congress: బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో పీహెచ్‌డీ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఉస్మానియా నుంచి డాక్ట‌రేట్ అందుకున్న సంప‌త్‌

congress mla sampath kumar completes doctorate in osmania university
  • రాజకీయాలలో బిజీగా ఉంటూనే పీహెచ్డీ చేసిన కాంగ్రెస్ నేత 
  • గ‌వ‌ర్న‌ర్‌, సీజేఐ చేతుల మీదుగా డాక్ట‌రేట్ అందుకున్న సంపత్ 
  • సంప‌త్‌ను అభినందించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీకి చెందిన యువ నేత‌, జోగులాంబ జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే సంప‌త్ కుమార్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ఏళ్లు దాటిపోతోంది. కాంగ్రెస్‌లో ఓ చోటా మోటా నేతగా ఎంట్రీ ఇచ్చిన ఆయ‌న ఏకంగా ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. అదే స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీలో ఓ రాష్ట్రానికి ప‌రిశీల‌కుడిగానూ ఆయ‌న కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. అటు పార్టీ, ఇటు ఎమ్మెల్యే హోదాలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై దృష్టి సారించ‌డం... ఎలా చూసినా ఆయ‌న ఫుల్ బిజీ కిందే లెక్క‌. ఇంత‌టి బిజీ షెడ్యూల్‌లోనూ ఆయ‌న చ‌దువుపై త‌న‌కున్న మ‌క్కువ‌ను మాత్రం వ‌దిలివేయ‌లేదు. 

ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యంలో ప‌రిశోధ‌క విద్యార్థిగా కొన‌సాగుతున్న సంప‌త్‌... తాజాగా ఆ కోర్సును పూర్తి చేశారు. బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో సంప‌త్ కుమార్ పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం వర్సిటీలో జ‌రిగిన 82వ స్నాత‌కోత్స‌వంలో భాగంగా ఆయ‌న రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌, భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌ల చేతుల మీదుగా డాక్ట‌రేట్‌ను అందుకున్నారు. ఈ ఫొటోల‌ను ఆయ‌న శుక్ర‌వారం రాత్రి పొద్దుపోయిన త‌ర్వాత సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోల‌ను చూసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి... పీహెచ్‌డీ ప‌ట్టా సాధించిన సంప‌త్‌ను అభినందించారు.
Congress
Alampur MLA
Sampath Kumar
Osmania University
Ph.D
Business Management

More Telugu News