Telangana: తెలంగాణలో 57 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్.. పంద్రాగస్టు నుంచే పంపిణీ
- ప్రస్తుతం 60 ఏళ్లు నిండినవారికే పింఛన్
- ఇకపై ఆ వయసును 57 ఏళ్లకు కుదించిన కేసీఆర్
- కొత్తగా 10 లక్షల మందికి పింఛన్ ఇవ్వనున్నట్లు వెల్లడి
తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ స్వాతంత్య్ర దినోత్సవ కానుకను కాస్తంత ముందుగానే ప్రకటించారు. రాష్ట్రంలో ఇకపై 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్ ఇవ్వనున్నట్లు కేసీఆర్ శనివారం ప్రకటించారు. ఈ మేరకు కేంద్రం వైఖరిని నిరసిస్తూ శనివారం ప్రగతి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భాగంగా ఈ అంశంపై కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఇకపై 57 ఏళ్లు నిండినవారందరికీ వృద్ధాప్య పింఛన్ అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 36 లక్షల పింఛన్లను పంపిణీ చేస్తున్నామని కేసీఆర్ చెప్పారు. మూడేళ్ల వయసు తగ్గిస్తూ తీసుకున్న కొత్త నిర్ణయంతో మరో 10 లక్షల మందికి పింఛన్‌ను అందిస్తామని ఆయన వెల్లడించారు. కొత్త పింఛన్లను ఆగస్టు 15 నుంచే అందించనున్నట్లు ఆయన తెలిపారు. కొత్త పింఛన్ దారులకు బార్ కోడ్ కలిగిన పింఛన్ కార్డులు అందజేస్తామన్నారు. ఇదిలా ఉంటే... సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను ఆగస్టు 15 సందర్భంగా విడుదల చేయాలని జైళ్ల శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు కేసీఆర్ తెలిపారు.