Sri Lanka: భారత్ ఒత్తిడికి తలొగ్గిన శ్రీలంక... యువాన్ వాంగ్ నౌకను ఇప్పుడు పంపవద్దంటూ చైనాకు విజ్ఞప్తి
- శ్రీలంకలో పోర్టు నిర్మించిన చైనా
- హంబన్ టోట పోర్టులో భాగస్వామ్యం
- యువాన్ వాంగ్-5 నౌక రాకపై భారత్ అభ్యంతరం
- ఇది నిఘా నౌక అని భావిస్తున్న భారత్
శ్రీలంకలోని హంబన్ టోట పోర్టును చైనా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అత్యాధునిక సైనిక వ్యవస్థలు కలిగివున్న చైనా నౌక యువాన్ వాంగ్-5 మరికొన్నిరోజుల్లో హంబన్ టోట పోర్టుకు రావాల్సి ఉంది. అయితే, ఈ నౌక రాక పట్ల భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇది నిఘా నౌక అని భారత్ అనుమానిస్తోంది. ప్రధానంగా ఇది పరిశోధన, సర్వే కోసం ఉద్దేశించినట్టుగా చెబుతున్నా, నిఘా వేయడానికి అవసరమైన సాధన సంపత్తి యువాన్ వాంగ్-5 నౌకలో ఉన్నాయని భారత్ భావిస్తోంది.
ఈ నౌక సాధారణ పరిశీలన నిమిత్తమే హంబన్ టోట పోర్టుకు వస్తోందని ఇటీవల శ్రీలంక వర్గాలు వెల్లడించాయి. అయితే, భారత్ పలుమార్గాల్లో చేసిన ఒత్తిళ్లతో శ్రీలంక ప్రభుత్వం వెనక్కితగ్గింది. జియాంగ్యిన్ రేవు నుంచి యువాన్ వాంగ్-5 నౌకను ఇప్పుడు పంపవద్దంటూ చైనాకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కొలంబోలోని చైనా రాయబార కార్యాలయానికి లేఖ రాసింది.
కాగా, శ్రీలంకను అడ్డంపెట్టుకుని హిందూ మహాసముద్రంలో ప్రాబల్యం పెంచుకోవాలని చైనా గత కొన్నాళ్లుగా ప్రయత్నిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే శ్రీలంకలో పలు ప్రాజెక్టులు చేపడుతోందని, హంబన్ టోట పోర్టును కూడా అభివృద్ధి చేసి, తన నౌకల రాకపోకలకు ఓ స్థావరాన్ని ఏర్పరచుకుందని పలు కథనాలు వచ్చాయి.