Winston Benjamin: కరీబియన్ దీవుల్లో క్రికెట్ ను బతికించండి... సచిన్ ను సాయం కోరిన వెస్టిండీస్ మాజీ క్రికెటర్
- ఒకప్పుడు గొప్పగా వెలిగిన వెస్టిండీస్ క్రికెట్
- కాలక్రమంలో పతనం
- జూనియర్ ఆటగాళ్లకు కిట్లు ఇప్పించాలన్న బెంజమిన్
- సచిన్ ను అర్థిస్తూ వీడియో సందేశం
ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన వెస్టిండీస్ కాలక్రమంలో దారుణంగా పతనమైంది. కరీబియన్ ప్రాంతంలోని వివిధ ద్వీపదేశాల నుంచి వచ్చిన ఆటగాళ్ల మధ్య మునుపటి ఐక్యత లోపించడం, ఆటగాళ్లకు అరకొర పారితోషికాలు, జూనియర్ లెవెల్లో సౌకర్యాల లేమి విండీస్ క్రికెట్ ను దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో, వెస్టిండీస్ మాజీ క్రికెటర్ విన్ స్టన్ బెంజమిన్ స్పందించారు.
కరీబియన్ దీవుల్లో క్రికెట్ ను బతికించాలంటూ భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ను అర్థించారు. వెస్టిండీస్ లో క్షేత్రస్థాయిలో క్రికెట్ కు చేయూత అందించాలని బెంజమిన్ విజ్ఞప్తి చేశారు. అయితే తమకు డబ్బు అక్కర్లేదని, బ్యాట్లు, ఇతర క్రికెట్ ఉపకరణాలు ఇస్తే చాలని స్పష్టం చేశారు. గతంలో ఆటగాళ్ల సహాయార్థం షార్జాలో బెనిఫిట్ మ్యాచ్ లు నిర్వహించేవారని, అలాంటి బెనిఫిట్లను తాము కోరుకోవడంలేదని తెలిపారు.
"నేను కోరేదల్లా ఓ 10-15 క్రికెట్ బ్యాట్లు మాత్రమే. వాటిని నాకు పంపిస్తే నేను వాటిని జూనియర్ క్రికెటర్లకు ఇస్తాను. నాకు 20 వేల డాలర్లు ఇచ్చినా తీసుకోను... కొన్ని బ్యాట్లు పంపించండి చాలు" అంటూ 57 ఏళ్ల బెంజమిన్ ఓ వీడియో సందేశం వెలువరించారు.
"మిస్టర్ సచిన్ టెండూల్కర్... ఇప్పుడు మీరో స్థాయిలో ఉన్నారు. మీరు నాకు ఈ సాయం చేయగలరా? నాకు ఒక్క ఫోన్ కాల్ కొట్టండి" అంటూ విన్ స్టన్ బెంజమిన్ తన ఫోన్ నెంబరు కూడా పంచుకున్నారు. కాగా, భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ తమకు కొంత క్రికెట్ సామగ్రి పంపారని, అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని వివరించారు. విండీస్ క్రికెట్ పట్ల దాతలు ఉదారంగా స్పందించి క్రికెట్ ఉపకరణాలు పంపించాలని బెంజమిన్ విజ్ఞప్తి చేశారు.
బెంజమిన్ విండీస్ తరఫున 21 టెస్టులాడి 61 వికెట్లు పడగొట్టాడు. 85 వన్డేల్లో 100 వికెట్లు తీశాడు. 1986లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఈ ఫాస్ట్ బౌలర్ 1995లో ఆటకు వీడ్కోలు పలికాడు.