Pennsylvania: ఇంట్లో అగ్ని ప్రమాదం.. పదిమంది సజీవ దహనం: మంటలు అదుపు చేసేందుకు వెళ్లిన ఫైర్ కంపెనీ ఉద్యోగిదే ఇల్లు!
- అమెరికాలోని పెన్సెల్వేనియాలో ఘటన
- ప్రమాదంలో ఫైర్ ఉద్యోగి కుటుంబ సభ్యుల మృతి
- మృతుల్లో ఏడేళ్లలోపున్న ముగ్గురు చిన్నారులు
కొన్ని విషాదాలు ఎటునుంచి కమ్ముకొస్తాయో తెలియదు. ఉన్నట్టుండి మనిషిని చుట్టుముట్టేస్తాయి. వాటి నుంచి తేరుకోవడం చాలా కష్టం. అమెరికాలోని పెన్సెల్వేనియాలో జరిగిన ఈ ఘటన గుండెలు పిండేస్తోంది. హృదయాలను బరువెక్కిస్తోంది. నెస్కోపెక్లో శుక్రవారం తెల్లవారుజామున ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించినట్టు అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ వచ్చింది. ఫోన్ రిసీవ్ చేసుకున్న ఉద్యోగి వారు చెప్పిన అడ్రస్ ప్రకారం.. అది తమ సంబంధీకులు ఉండే పొరుగిల్లు అని నిర్ధారించుకున్నాడు. వెంటనే సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నాడు. అక్కడికెళ్లి చూడగానే ఆయన గుండె ఆగిపోయినంత పనైంది. ప్రమాదం జరిగిన ఇల్లు తన కుటుంబ సభ్యులు, బంధువులు ఉండేదే. ఏం చేయాలో ఆయనకు పాలపోలేదు. కన్నీళ్లు ఉబికి వచ్చాయి. ఆయన పేరు హరోల్డ్ బెకర్. వలంటీర్ ఫైర్ కంపెనీ ఉద్యోగి.
ఈ ఘటనలో ఆయన కుటుంబ సభ్యులు సహా మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 5,6,7 ఏళ్ల వయసున్న చిన్నారులతోపాటు 79 ఏళ్ల వయసున్న వారు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో తన కుమారుడు, కుమార్తె, మామ, బావ, బావమరిది, వదిన, ముగ్గురు పిల్లలు, ఇద్దరు బంధువులు చనిపోయారంటూ హరోల్డ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రమాదంలో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. అంతేకాదు, ఈ ఘటనలో మృతి చెందిన 19 ఏళ్ల యువకుడు డేల్ బెకర్ తల్లిదండ్రులు కూడా ఫైర్ కంపెనీకి సేవలు అందించేవారని ఆ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.