Team India: చివరి టీ20లోనూ చేతులెత్తేసిన విండీస్.. పర్యటనను ఘనంగా ముగించిన భారత్

India spin out WI for 100

  • 88 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన భారత్
  • శ్రేయాస్ అయ్యర్ అర్ధ సెంచరీ
  • విండీస్‌ను కుప్పకూల్చిన స్పిన్నర్లు
  • అక్షర్ పటేల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు

కరీబియన్ పర్యటనను టీమిండియా ఘనంగా ముగించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా విండీస్‌తో ఫ్లోరిడాలోని లాడెర్‌హిల్‌లో జరిగిన చివరి టీ20లో 88 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా టీ20 సిరీస్‌ను 4-1తో చేజిక్కించుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. శ్రేయాస్ అయ్యర్ అర్ధ సెంచరీతో విరుచుకుపడడంతో 188 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 189 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ 15.4 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌట్ అయింది. 

రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ బంతులను కాచుకోలేని ఆతిథ్య జట్టు బ్యాటర్లు క్రీజులోకి వచ్చినట్టే వచ్చి వెనుదిరిగారు. షిమ్రన్ హెట్మెయిర్ క్రీజులో కుదురుకుని అర్ధ సెంచరీ సాధించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. హెట్మెయిర్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 56 పరుగులు చేశాడు. మిగతా వారిలో ఎవరూ రాణించలేకపోయారు. ఆ జట్టులో ఐదుగురు ఆటగాళ్లు ఖాతా కూడా తెరవలేకపోయారు. మరో ముగ్గురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. షమ్రా బ్రూక్స్ చేసిన 13 పరుగులే జట్టులో రెండో అత్యధికం. భారత బౌలర్లలో రవిబిష్ణోయ్ 4 వికెట్లు పడగొట్టగా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ అర్ధ సెంచరీ (64) సాధించగా, దీపక్ హుడా 38, హార్దిక్ పాండ్యా 28 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో ఒడియన్ స్మిత్‌ మూడు వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.

  • Loading...

More Telugu News