Komatireddy Raj Gopal Reddy: నా రాజీనామాతో మునుగోడు అభివృద్ధి: రాజగోపాల్‌రెడ్డి
- మూడున్నరేళ్లుగా తన నియోజకవర్గానికి నిధులు కేటాయించలేదన్న కోమటిరెడ్డి
- నేడు స్పీకర్‌ను కలిసి రాజీనామా పత్రం అందిస్తానన్న నేత
- కలిసే అవకాశం ఇవ్వకుంటే కేంద్ర ఎన్నికల సంఘానికి రాజీనామా లేఖ పంపిస్తానన్న రాజగోపాల్‌రెడ్డి
కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తెలంగాణ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నేడు తన రాజీనామా లేఖను స్పీకర్‌కు అందించనున్నారు. నల్గొండ జిల్లా చండూరులో నిన్న విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా వెనక ఉన్న కారణాన్ని వెల్లడించారు. మూడున్నరేళ్లుగా తన నియోజకవర్గానికి నిధులు కేటాయించకపోవడంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదని అన్నారు. తన రాజీనామాకు కారణం అదేనన్న ఆయన.. తన రాజీనామాతో ఉప ఎన్నిక వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు.
తన నియోజకవర్గంలోని చండూరు, చౌటుప్పల్ పురపాలికల్లో కనీస సౌకర్యాలు కరవయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో ప్రభుత్వం సిరిసిల్ల, సిద్ధిపేట, గజ్వేల్ పురపాలికలను అభివృద్ధి చేసిందన్నారు. త్వరలోనే ఇక్కడి ప్రజలను బస్సుల్లో అక్కడికి తీసుకెళ్లి చూపిస్తానని చెప్పారు. తాను నేడు స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖను అందిస్తానని, కలిసే అవకాశం ఇవ్వకుంటే కొన్ని రోజులు వేచి చూసి నేరుగా అసెంబ్లీ కార్యదర్శితోపాటు కేంద్ర ఎన్నికల సంఘానికి రాజీనామా పత్రాన్ని పంపిస్తానని రాజగోపాల్‌రెడ్డి తెలిపారు.