Harmanpreet Kaur: మహిళల ఐపీఎల్ మాకు టర్నింగ్ పాయింట్ : హర్మన్ ప్రీత్
- దేశీ క్రీడాకారిణులకు గొప్ప వేదిక అందుబాటులోకి వస్తుందన్న కౌర్
- ప్రతిభను చూపించుకునే అవకాశం లభిస్తుందన్న కెప్టెన్
- కామన్వెల్త్ లో వెండి పతకం సాధించడం గొప్ప విజయంగా అభివర్ణన
మహిళా ఐపీఎల్ యువ క్రికెటర్లకు ఎంతో మేలు చేస్తుందని భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ పేర్కొంది. ఐపీఎల్ వంటి పెద్ద వేదికపై తమ ప్రతిభను చూపించుకునే అవకాశం యువ మహిళా క్రికెటర్లకు లభిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇది జాతీయ జట్టుకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపింది.
కామన్వెల్త్ క్రీడా వేదికపై భారత మహిళా క్రికెట్ జట్టు సిల్వర్ పతకం గెలుచుకున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. ఆదివారం ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలు కావడంతో భారత జట్టు వెండి పతకంతో సరిపెట్టుకుంది.
‘‘మన క్రీడాకారిణులకు విదేశీ లీగ్ లలో ఆడే అవకాశం లభించడం లేదు. మహిళల ఐపీఎల్ నిర్వహించినట్టయితే గొప్ప ప్లాట్ ఫామ్ అందుబాటులోకి వస్తుంది. మన దేశంలో ప్రతిభావంతులైన మహిళా క్రికెటర్లకు కొదవ లేదు. కానీ, పెద్ద వేదికలపై వారికి ఏమంత అనుభవం ఉండడం లేదు. అందుకు ఐపీఎల్ గొప్ప వేదిక అవుతుంది’’ అని హర్మన్ ప్రీత్ కౌర్ వివరించింది.
భారత జట్టుకు సిల్వర్ పతకం లభించడాన్ని గొప్ప విజయంగా ఆమె అభివర్ణించింది. భారత జట్టు కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనడం ఇదే మొదటిసారిగా పేర్కొంది. వచ్చే ఏడాది (2023) నుంచి మహిళల ఐపీఎల్ ను నిర్వహించనున్నట్టు బీసీసీఐ కార్యదర్శి జైషా ప్రకటించడం గుర్తుండే ఉంటుంది.