Dulquer Salmaan: నేను హీరోను అవుతానంటే నాన్న వద్దన్నాడు: దుల్కర్
- మమ్ముట్టి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన దుల్కర్
- ఇతర భాషా సినిమాల పట్ల ఉత్సాహం
- కెరియర్ తొలినాళ్ల గురించి ప్రస్తావించిన దుల్కర్
- తండ్రి మాటలను గుర్తుచేసుకుంటూ నవ్వేసిన హీరో
మలయాళంలో స్టార్ హీరోగా కొనసాగుతున్న దుల్కర్ సల్మాన్, 'సీతా రామం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వసూళ్లు ఆశించిన స్థాయిలో లేకపోయినప్పటికీ, ఓవర్సీస్ లో మంచి వసూళ్లనే రాబడుతోంది. తాజా ఇంటర్వ్యూలో దుల్కర్ మాట్లాడుతూ .. తాను సినిమాల్లోకి రావడం తన తండ్రికి ఎంతమాత్రం ఇష్టం లేదంటూ బాంబ్ పేల్చాడు.
"నేను సినిమాల్లోకి రావడం నాన్నకు ఇష్టం లేదు. అందువల్లనే ఫైట్లు .. డాన్సులు నేర్పించలేదు. ఆయన చెప్పినట్టుగానే చదువుకుని .. దుబాయ్ లో కొంతకాలం ఉద్యోగం చేశాను. కానీ నాలుగు గోడల మధ్య ఉద్యోగం చేయడం నా వల్ల కాలేదు. అందువల్లనే కేరళకి తిరిగి వచ్చేశాను. హీరోగా ట్రై చేస్తానని నాన్నతో చెప్పాను. అప్పుడు ఆయన చాలా బాధపడ్డారు" అన్నాడు.
"అసలు అంత కోపంతో .. బాధతో ఆయనను ఎప్పుడూ చూసింది లేదు. 'ఎప్పుడూ కూడా నువ్వు సరదాగా డాన్స్ చేయడంగానీ .. నటించడానికి ట్రై చేయడం గాని నేను చూడలేదు. యాక్టింగ్ నువ్వు అనుకున్నంత తేలిక కాదు .. అది నీవల్ల కాదు. నా పరువు తీసే ఆలోచన చేయకు' అంటూ నాపై మండిపడ్డారు. ఇప్పుడు ఆయన నా ప్రతి సినిమా చూసి సూచనలు చేసేంతగా మారిపోయారు" అంటూ చెప్పుకొచ్చాడు.