CM KCR: 'నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో నీతి ఆయోగ్ లో నీతి కూడా అంతే' అంటూ ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మంత్రి కేటీఆర్ రిప్లై
- నీతి ఆయోగ్ భేటీకి గైర్హాజరైన సీఎం కేసీఆర్
- సమావేశానికి వెళ్లి కేంద్రాన్ని సీఎం ప్రశ్నించాల్సిందన్న
ప్రొఫెసర్ నాగేశ్వర్ - అయినను పోయి రావలె హస్తినకు అనేది పాత సామెత అంటూ కేటీఆర్ జవాబు
నీతి ఆయోగ్ గురించి తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో నీతి ఆయోగ్ లో నీతి కూడా అంతే అని ఎద్దేవా చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో ఆదివారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గైర్హాజరయ్యారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కేసీఆర్ భేటీకి వెళ్లి ఉండాల్సిందని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. ‘సంధి కుదరదని తెలిసి శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్లిన మహాభారతం నుండి కేసీఆర్ స్ఫూర్తి పొందాల్సింది. ప్రధానమంత్రి, సీఎం సమక్షంలో జరిగిన సమావేశంలోనే నీతి ఆయోగ్‌ని సీఎం ప్రశ్నించాల్సి ఉంది’ అని నాగేశ్వర్ ట్వీట్ చేశారు.
దీనికి మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. ‘‘అయినను పోయి రావలె హస్తినకు” అనేది పాత సామెత నాగేశ్వర్ గారు అంటూ రిప్లై ఇచ్చారు. ‘ఈ కేంద్ర ప్రభుత్వం ఒక పక్షపాత, వివక్ష పూరితమైన మనస్తత్వంతో గతంలో నీతి ఆయోగ్ సిఫార్సు బుట్టదాఖలు చేసింది. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో నీతి ఆయోగ్ లో నీతి కూడా అంతే’ అని ట్వీట్ చేశారు. అందుకే సీఎం కేసీఆర్ నీతి ఆయోగ్ భేటీని బాయ్ కాట్ చేశారని కేటీఆర్ స్పష్టం చేశారు.