CM Jagan: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదు: సీఎం జగన్ స్పష్టీకరణ
- వ్యవసాయ, పౌరసరఫరా శాఖలపై సమీక్ష
- అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం
- రైతులకు కనీస మద్దతు ధర అందాల్సిందేనని స్పష్టీకరణ
రాష్ట్ర వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలపై సీఎం జగన్ సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన సంబంధిత శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. వ్యవసాయ రంగంపై స్పందిస్తూ, రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మిల్లర్ల పాత్ర ఉండరాదని స్పష్టం చేశారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలో ఒక్క పైసా తగ్గకూడదని, రైతులు మెరుగైన ప్రయోజనం పొందాలని పేర్కొన్నారు. రైతులకు ఎంఎస్పీ ధర అందాల్సిందేనని అన్నారు. ఖరీఫ్ పంటల కొనుగోళ్లపై ఇప్పటినుంచే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.
రైతుల పొలాల్లో భూసార పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహిస్తుండాలని, పరీక్షలు జరిపి రైతులకు సాయిల్ కార్డులు అందజేయాలని తెలిపారు. ఆ భూమి స్వభావానికి తగినట్టుగా ఎరువుల వాడకం, పంటల సాగుపై సలహాలు, సూచనలు అందజేయాలని అధికారులను ఆదేశించారు.
అటు, రైతు భరోసా కేంద్రాలను రాష్ట్ర పౌరసరఫరాల శాఖతో అనుసంధానం చేసే అంశాన్ని కూడా సీఎం జగన్ ఈ సమీక్ష సమావేశంలో చర్చించారు. లైన్ డిపార్టమెంట్లతో సమన్వయం చేసుకుంటూ రైతు భరోసా కేంద్రాలు సమర్థంగా కొనసాగడానికి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అందుకోసం పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని తెలిపారు.