Fish: చేపలే ఎగిరొచ్చి వలలో పడుతున్నాయ్.. వైరల్ వీడియో ఇదిగో..
- అమెరికాలోని ఇల్లినాయిస్ లో ‘రెడ్ నెక్ టోర్నమెంట్’ సందర్భంగా ఘటన
- ఎక్కువ సంఖ్యలో వేటాడుతూ ఉండటంతో పారిపోయేందుకు చేపల జంపింగ్
- ఎగిరినప్పుడు చటుక్కున పట్టేసుకున్న పోటీ దారులు
ఎక్కడైనా చేపలు పట్టాలంటే ఎంతో కొంత కష్టపడాలి. చిన్నగా అయితే గాలం వేసి పెట్టాలి. ఓపికగా ఎదురు చూడాలి. గాలానికి చేప తగలగానే వెంటనే లాగేసి పట్టుకోవాలి. ఇక పెద్దగా అయితే వలలు విసిరి లాగాలి. అక్కడా చేపలు పడితే పడతాయి లేకుంటే లేనట్టే.. కానీ ఆ చేపలే మీ వైపు ఎగిరొస్తే.. ఎగిరొచ్చి మరీ మీ చేతుల్లోని జాలీల్లో పడి పోతుంటే.. అది భలేగా ఉంటుంది కదా.. అమెరికాలోని ఇల్లినాయిస్ లో జరిగిన ‘రెడ్ నెక్ టోర్నెమెంట్’ సందర్భంగా ఇలా చేపలు ఎగురుతున్న వీడియో వైరల్ గా మారింది.
చిక్కకూడదని పారిపోతూ.. చిక్కుతూ..
- ఇల్లినాయస్ లోని మంచి నీటి రిజర్వాయర్ల లో ఓ రకం చేపలు విపరీతంగా పెరిగిపోతుంటాయి. ఈ నేపథ్యంలో ఏటా ఆ చేపలను పట్టేసే లక్ష్యం ఓవైపు.. సరదా పోటీ మరోవైపు కలిసి.. ‘రెడ్ నెక్ ఫిషింగ్ టోర్నమెంట్’ను నిర్వహిస్తుంటారు. అలా ఇటీవలే ఈ టోర్నీ జరిగింది.
- చాలా మంది బోట్లు వేసుకుని, చిన్నపాటి వలలు పట్టుకుని రంగంలోకి దిగారు. అన్నీ వేగంగా ప్రయాణించే స్పీడ్ బోట్లు కావడం, వలలు పట్టుకుని తిరుగుతుండటంతో.. రిజర్వాయర్ లో చేపలు ఆగమాగం అయ్యాయి.
- బోట్లు, వలలు సమీపిస్తున్న కొద్దీ నీటిలో ఎగిరి దూకడం మొదలు పెట్టాయి. ఇలా ఎగురుతున్నప్పుడు పోటీ దారులు చటుక్కున తమ చేతుల్లో ఉన్న జాలీలతో పట్టేసుకోవడం మొదలుపెట్టారు. కొందరు దీనిని వీడియో తీశారు.
- వేడి గిన్నెలో పాప్ కార్న్ ఎగిరిపడుతున్నట్టుగా చేపలు ఎగురుతున్నాయంటూ ఈ వీడియోలను ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో.. లక్షలాది వ్యూస్ వస్తున్నాయి.
- ఈ పోటీలో ఎవరు ఎక్కువ చేపలు పడితే.. వారికి బహుమతులు ఇస్తుంటారు. కానీ ఆ చేపలను మాత్రం తినేందుకు వాడరు. ఎందుకంటే ఆ రకం చేపలు తినేందుకు పనికిరావని.. వాటిని జంతువులకు ఆహారంగా, ఎరువులుగా ఉపయోగిస్తారని నిర్వాహకులు చెబుతున్నారు.