Bangladesh: శ్రీలంక బాటలో బంగ్లాదేశ్.. పెట్రో ధరలు 50 శాతం పెంపు.. ఆందోళనతో రోడ్డెక్కిన ప్రజలు!
- ఒకేసారి అడ్డగోలుగా పెట్రోల్ రేట్లు పెంచేసిన బంగ్లాదేశ్
- దీనితో రవాణా చార్జీలు పెంచుతున్నట్టు ప్రకటించిన సంస్థలు
- బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని ఆర్థిక వేత్తల అంచనాలు
బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒక్కసారిగా పెట్రోల్ ఉత్పత్తుల ధరలను పెంచేసింది. ఇంతకుముందటి ధరలతో పోలిస్తే ఒక్కసారిగా 52 శాతం మేర రేట్లు పెంచేశారు. దీని ప్రభావంతో రవాణా, నిత్యావసరాల ధరలు పెరుగుతుండటంతో.. ప్రజలు ఆందోళనలకు దిగుతున్నారు. శ్రీలంక తరహాలో ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తున్న దేశాల్లో బంగ్లాదేశ్ కూడా చేరుతుందా అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తోందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.
రోడ్లపైకి వస్తున్న ప్రజలు
బంగ్లాదేశ్ లో పెట్రోల్ ధర ఇటీవలి వరకు 84 టాకాలు (బంగ్లాదేశ్ కరెన్సీ) ఉండగా.. ఇటీవల ఆ దేశ ప్రభుత్వం ఒక్కసారిగా 44 టాకాలు (52 శాతం) పెంచింది. దీనితో పెట్రోల్ రేటు 130 టాకాలకు చేరింది. డీజిల్ ధరలను కూడా 34 టాకాలు పెంచింది. దీనిపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రజలు ఆందోళనలకు దిగుతున్నారు. వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు.
బంగ్లాదేశ్ 1971లో స్వాతంత్ర్యం పొందగా.. ఇప్పటివరకు ఎప్పుడూ ఇంతగా పెట్రోల్ ఉత్పత్తుల ధరలు పెంచలేదని ఆ దేశ మీడియా సంస్థలు విశ్లేషిస్తున్నాయి. మరోవైపు ఆ దేశ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తప్పనిసరిగా ధరలు పెంచాల్సి వచ్చిందని ప్రకటించింది.
నిజానికి బంగ్లాదేశ్ ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉంది. కానీ కరోనా అనంతర పరిస్థితులు, విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోవడం, ఎగుమతులు తగ్గి, దిగుమతులు పెరిగి వాణిజ్య లోటు ఏర్పడటం వంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. అంతర్జాతీయంగా చమురు, సరుకుల ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం కూడా పెరిగిపోయింది.