Taiwan: చైనాకు దీటుగా తైవాన్ సైనిక విన్యాసాలు
- మూడు రోజుల పాటు నిర్వహణ
- ఫిరంగులు, హోవిట్జర్లు, వందలాది సైనికుల భాగస్వామ్యం
- చైనా ఆక్రమణకు దిగితే తిప్పికొట్టేందుకు సన్నద్ధత
తైవాన్ చుట్టూ గత కొన్ని రోజులుగా చైనా సాగిస్తున్న యుద్ధ సన్నాహాలు, సైనిక విన్యాసాల నేపథ్యంలో తైవాన్ కూడా సంచలన నిర్ణయం తీసుకుంది. తైవాన్ మంగళవారం సైనిక విన్యాసాలు మొదలు పెట్టింది. ఒకవేళ చైనా దాడి తలపెడితే తనను తాను రక్షించుకునేందుకు సైనిక సన్నద్ధతను పరీక్షిస్తోంది. దక్షిణ తైవాన్ లోని పింగ్ టంగ్ ప్రాంతంలో సైనిక విన్యాసాలు మొదలైనట్టు తైవాన్ ఎయిత్ ఆర్మీ కార్ప్స్ అధికార ప్రతినిధి లూవీ జే ధ్రువీకరించారు. లక్ష్యాలను తాకేలా కాల్పుల, ఫిరంగుల ప్రయోగాలు చేస్తున్నట్టు తెలిపారు.
అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ లో పర్యటించడం పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్న చైనా.. గత వారం తైవాన్ చుట్టు పక్కల సముద్ర జలాలపై సైనిక విన్యాసాలు మొదలు పెట్టడం తెలిసిందే. తైవాన్ స్వతంత్ర ప్రాంతమే అయినప్పటికీ.. అది తన ప్రాదేశిక భూభాగంలోనిదిగా చైనా మొదటి నుంచి వాదిస్తోంది. తైవాన్ తన విన్యాసాలను గురువారం వరకు నిర్వహించనుంది. వందలాది ట్రూప్ లు, 40 హోవిట్జర్లను ఇందులో భాగం చేసింది. చైనాకు బదలుగా తాము విన్యాసాలు మొదలు పెట్టలేదని లూవీ జే స్పష్టం చేశారు.