- రాజస్థాన్ జైసల్మేర్ కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతా
- దాన్నుంచి అమెజాన్ గిఫ్ట్ కార్డ్ పంపాలంటూ సందేశాలు
- అదుపులోకి తీసుకున్న పోలీసులు
రాజస్థాన్ లోని జైసల్మేర్ కలెక్టర్ టీనాదాబి పేరుతో వాట్సాప్ ఖాతా తెరిచి ప్రముఖులను మోసగిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్ రాష్ట్ర పట్టణాభివృద్ధి ట్రస్ట్ సెక్రటరీ సునీతా చౌదరి వాట్సాప్ కు వచ్చిన సందేశం అతడ్ని పట్టించింది. టీనాదాబి పేరు, ఆమె ఫొటోతో ఉన్న ఖాతా నుంచి అమెజాన్ గిఫ్ట్ కార్డ్ కావాలంటూ సందేశం వచ్చింది.
అతడు వాట్సాప్ ఖాతా తెరిచి, ఐఏఎస్ అధికారిణి అయిన టీనాదాబి పేరుతో మోసాలకు తెరదీశాడు. గుర్తు తెలియని నంబర్లకు ఆ ఖాతా నుంచి అమెజాన్ గిఫ్ట్ కార్డులు పంపించాలని కోరుతున్నాడు. అతడి ఇంగ్లిష్ చక్కగా ఉండడంతో చూసిన వారు నిజంగా టీనాదాబి ఖాతా నుంచే వచ్చిందని పొరబడేలా ఉంది.
కానీ సునీతా చౌదరి దీన్ని సందేహించారు. టీనాబాది పనుల్లో బిజీగా ఉంటుందని ఆమెకు తెలుసు. అదే సమయంలో తనకు అమెజాన్ ఖాతా లేకపోయినా, గిఫ్ట్ కార్డ్ పంపాలని కోరడంతో అనుమానించి, టీనాదాబికే నేరుగా కాల్ చేసి మాట్లాడారు. షాక్ తిన్న టీనాదాబి ఎస్పీకి సమాచారం ఇచ్చారు. సైబర్ పోలీసుల సాయంతో మొబైల్ నంబర్ ఆధారంగా నిందితుడు దుంగార్ పూర్ జిల్లాకు చెందినవాడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.