gold jewellery: 14 క్యారెట్ల బంగారం ఆభరణాలు మంచివేనా..?
- 18, 14 క్యారెట్ల ఆభరణాలకు పెరుగుతున్న డిమాండ్
- 22 క్యారెట్ల ఆభరణాలతో పోలిస్తే మన్నిక ఎక్కువ
- ధరలు 22-36 శాతం తక్కువ
- ఆన్ లైన్ లో ఎన్నో ప్రముఖ సంస్థల విక్రయాలు
ప్రతి రంగంలోనూ నూతన ఆవిష్కరణలు జరుగుతుంటాయి. అలాగే బంగారం ఆభరణాల విషయంలో కూడా ఇప్పుడు కొత్త పోకడలు కనిపిస్తున్నాయి. 22 క్యారెట్ల ఆభరణాల స్థానంలో ఇప్పుడు 18, 14 క్యారెట్ల ఆభరణాలకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా 14 క్యారెట్లతో చేసినవి తక్కువ ధరకు అందుబాటులో ఉంటున్నాయి. 22 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారం ఆభరణాలతో పోలిస్తే ఇవి చౌక అనే చెప్పాలి. 18 క్యారెట్ల బంగారంతో పోలిస్తే 22 శాతం తక్కువగా, 22 క్యారెట్లతో పోలిస్తే 36 శాతం తక్కువ ధరకే ఇవి లభ్యమవుతున్నాయి.
సాధారణంగా బంగారం ఆభరణాల తయారీకి 22 క్యారెట్లను ఉపయోగిస్తుంటారు. అలాగే, తక్కువ ధరలో కొనుగోలు చేసుకునే వారికి కొంచెం తక్కువ క్యారట్లతో చేసినవి కూడా లభిస్తుంటాయి. ఇటీవలి కాలంలో వీటికి డిమాండ్ పెరిగింది. వజ్రాలు, రత్నాలతో చేసే ఆభరణాలకు 18 క్యారెట్లను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే 22 క్యారెట్లతో పోలిస్తే 18 క్యారెట్లు మరింత గట్టిగా ఉంటుంది. దాంతో రాళ్లను ఆపగలవు.
14 క్యారెట్ల బంగారంలో స్వచ్ఛమైన బంగారం 58.3 శాతమే ఉంటుంది. మిగిలిన మేర ఇతర లోహాలను కలుపుతారు. దాంతో 22 క్యారెట్లతో పోలిస్తే వీటి మన్నిక ఎక్కువ. ధరలు కూడా తక్కువ. ఆకర్షణీయతలో తీసిపోవు.
ధరల విషయానికొస్తే 22 క్యారెట్ల తులం బంగారం ఆభరణాల ధర రూ.48,690 ఉందనుకుంటే, 18 క్యారెట్ల ధర రూ.39,840, 14 క్యారెట్ల ధర రూ.30,980గా ఉంటుంది. అయితే 22, 18 క్యారెట్ల బంగారం ఆభరణాలపై రుణాలు లభిస్తాయి. కానీ, 14 క్యారెట్ల ఆభరణాలపై రుణాలు లభించవు. కొనుగోలు చేసిన సంస్థల వద్ద జీవిత కాలం పాటు వాటిని ఎక్సేంజ్ చేసుకోవచ్చు. ఆభరణాలను జ్యుయలర్ కు తిరిగి విక్రయిస్తే బంగారంపై 3 శాతం తరుగు కింద తగ్గిస్తారు. డైమండ్, జెమ్ స్టోన్స్ తో చేసిన ఆభరణాలు అయితే తరుగు 10-30 శాతం మధ్య ఉంటుంది.
టాటా తనిష్క్, కల్యాణ్ జ్యుయలర్స్ క్యాండియర్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ఇలా ఎన్నో ఆన్ లైన్ వేదికలపై ఇవి లభిస్తాయి. రిటర్న్ పాలసీ, నియమ, నిబంధనలు చదివిన తర్వాతే కొనుగోలు నిర్ణయం తీసుకోవడం మంచిది.