Nitish Kumar: బీహార్ లో బీజేపీతో నితీశ్ కుమార్ తెగదెంపులు!
- బీహార్ మరో ఏక్ నాథ్ షిండే!
- జేడీయూలో ఆర్సీపీ సింగ్ ముసలం
- తరచుగా నితీశ్ పై విమర్శలు చేస్తున్న సింగ్
- జేడీయూ ఎమ్మెల్యేలు, ఎంపీలతో చర్చించిన నితీశ్
- కాసేపట్లో గవర్నర్ ను కలిసే అవకాశం
బీహార్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు నెలకొంటున్నాయి. ఇటీవల మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే వ్యవహారం తర్వాత బీహార్ లోనూ అలాంటి పరిస్థితులు కల్పిస్తోందని బీజేపీపై జేడీయూ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో నేటి ఉదయం జేడీయూ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సీఎం నితీశ్ కుమార్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని నిర్ణయించారు. కాగా, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తో కలిసి నితీశ్ కుమార్ ఈ సాయంత్రం గవర్నర్ ను కలవనున్నారు.
ఈ పరిణామాలన్నింటికీ కారకుడు జేడీయూ సీనియర్ నేత ఆర్సీపీ సింగ్. ఇటీవల ఆర్సీపీ సింగ్ బీజేపీతో సన్నిహితంగా మెలుగుతున్నారు. తరచుగా నితీశ్ కుమార్ ను విమర్శిస్తూ సొంత పార్టీలో కలకలం రేపుతున్నారు. దాంతో, ఆర్సీపీ సింగ్ మరో ఏక్ నాథ్ షిండే అవుతాడేమోనన్న అనుమానాలు జేడీయూ వర్గాల్లో పొడసూపాయి. జేడీయూలో చీలికలు తెచ్చేందుకు బీజేపీ యత్నిస్తోందంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో, నితీశ్ కుమార్ వేగంగా పావులు కదుపుతున్నారు. ఇటీవల ఢిల్లీలో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి కూడా నితీశ్ డుమ్మా కొట్టారు.