Akhilesh Yadav: బీహార్లో జేడీయూ, ఆర్జేడీ దోస్తీని స్వాగతించిన అఖిలేశ్ యాదవ్
- బీహార్ లో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు
- బీజేపీతో జేడీయూ కటీఫ్
- ఆర్జేడీతో జట్టుకట్టిన నితీశ్ కుమార్
- రేపు సీఎంగా ప్రమాణస్వీకారం
బీహార్ లో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ స్పందించారు. బీహార్ లో కొత్తగా బీజేపీయేతర కూటమి ఏర్పడిన నేపథ్యంలో జేడీయూ-ఆర్జేడీ బంధాన్ని స్వాగతించారు. మరిన్ని పార్టీలు కాషాయ శిబిరానికి వ్యతిరేకం అవుతాయని అఖిలేశ్ పేర్కొన్నారు. 1942లో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ఉద్యమం వచ్చిందని, ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా బీహార్ లో అలాంటి ఉద్యమమే ప్రారంభమైందని వెల్లడించారు.
కాగా, బీహార్ లో ఏడు పార్టీల మహా కూటమి ఏర్పడింది. సీఎంగా నితీశ్ కుమార్ మరోసారి పీఠం ఎక్కనున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఆయన ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది. గవర్నర్ ను కలిసిన సందర్భంగా నితీశ్ కుమార్ మాట్లాడుతూ, తమకు 164 మంది ఎమ్మెల్యేల బలం ఉందని ధీమా వ్యక్తం చేశారు.
బీహార్ అసెంబ్లీలో 243 సీట్లున్నాయి. బీజేపీకి 74 సీట్లు ఉండగా, జేడీయూకి 43 సీట్లు ఉన్నాయి. అయితే, ఇప్పుడు బీజేపీతో తెగదెంపులు చేసుకున్న జేడీయూ 75 సీట్లున్న ఆర్జేడీతో జట్టుకట్టింది. మరో ఐదు ఇతర పార్టీలు కూడా ఈ కూటమిలో కలిశాయి. దీనిపై రేపు అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.