Gali Janardhana Reddy: ఓబుళాపురంలో తవ్వకాలకు అనుమతి కోసం సుప్రీంను ఆశ్రయించిన గాలి జనార్దన్‌రెడ్డి.. అభ్యంతరం లేదన్న ఏపీ ప్రభుత్వం

Gali Janardhana reddy ready to Mining in Obulapuram once again
  • ఓబుళాపురంలో ఓఎంసీ అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు
  • ఓఎంసీ విజ్ఞప్తిని పరిశీలించాల్సి ఉందన్న సుప్రీంకోర్టు
  • ఓఎంసీ కేసును విచారిస్తున్న మరో ధర్మాసనానికి నివేదించాలన్న సుప్రీంకోర్టు
  • నేడు జరగనున్న విచారణ
మైనింగ్ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి ఏపీలో తవ్వకాలకు అనుమతి ఇవ్వాలంటూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా ఓబుళాపురంలో ఐరన్ ఓర్ తవ్వకాలకు అనుమతినివ్వాలంటూ జనార్దన్‌రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) సుప్రీంకోర్టును కోరింది.  

అయితే, ఇక్కడ గతంలో ఓఎంసీ అక్రమాలకు పాల్పడిందని, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మధ్య సరిహద్దులను చెరిపేసి, సుంకలమ్మ ఆలయం కూల్చేసి తవ్వకాలు జరిపినట్టు ఓఎంసీపై కేసులు నమోదయ్యాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి. అక్రమాలు జరిగినట్టు నిర్ధారించాయి. దీంతో తవ్వకాలు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం 2009లో ఆదేశించడంతో..  గాలి జనార్దన్‌రెడ్డి అప్పటి ఉమ్మడి ఏపీ హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. 

అయితే, ఈ తీర్పును సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. మరోపక్క ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఓబుళాపురంలో ‘గాలి’ కంపెనీ తవ్వుకునేందుకు తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. దీంతో సుప్రీంకోర్టు ఓఎంసీ విజ్ఞప్తిని పరిశీలించాల్సి ఉందని పేర్కొంది. ఓఎంసీపై దాఖలైన మరో కేసును విచారిస్తున్న ధర్మాసనానికి ఈ కేసును కూడా నివేదించాలని సూచించింది. దీనిపై నేడు విచారణ జరగనుంది.
Gali Janardhana Reddy
OMC
Obulapuram
Andhra Pradesh
YS Jagan

More Telugu News