gold: మీ పెట్టుబడుల్లో ఎంత బంగారం ఉండొచ్చు..?
- ప్రతి ఒక్కరి పెట్టుబడులలో బంగారానికి చోటు ఉండాలంటున్న నిపుణులు
- 10-15 శాతం మధ్య కేటాయించుకోవచ్చని సూచన
- పెట్టుబడుల్లో వైవిధ్యం, రిస్క్ తగ్గించుకునే సాధనం
ఆర్జించే ప్రతీ వ్యక్తికి ఆర్థిక ప్రణాళిక ఉండాల్సిందే. లేదంటే వస్తున్న రూపాయి ఎందుకు ఖర్చవుతుందో, ఎటు వెళుతుందో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో పొదుపు చేయలేక అత్యవసరాల్లో అప్పులపాలు అయ్యే పరిస్థితి తెచ్చుకోకూడదు. ప్రతి ఒక్కరూ తమ ఆర్జనలో కొంత మొత్తాన్ని పెట్టుబడులకు మళ్లించాల్సిందే. ఎంత చెట్టుకు అంత గాలి అనే మాదిరే పొదుపు, మదుపులు ఉండాలి.
మంచి రాబడి కోసం ఈక్విటీలు ఒక మార్గం. ఇంకా రియల్ ఎస్టేట్, బంగారం, ఫిక్స్ డ్ డిపాజిట్లు తదితర సాధనాలు ఉన్నాయి. ఈక్విటీల్లో దీర్ఘకాలంలో అధిక రాబడి ఆశించొచ్చు. అదే సమయంలో అస్థిరతలు, రిస్క్ పాళ్లు ఎక్కువ. అందుకని పెట్టుబడులను వైవిధ్యం చేసుకునేందుకు కొంత మొత్తాన్ని బంగారానికి కేటాయించుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. చాలా మంది ఫిక్స్ డ్ డిపాజిట్లు, లేదంటే మ్యూచువల్ ఫండ్స్, షేర్లకు పరిమితం అవుతుంటారు. బంగారాన్ని పెట్టుబడి సాధనంగా చూడరు. కానీ, పెట్టుబడుల్లో బంగారాన్ని కూడా చోటు ఇవ్వాల్సిందేనన్నది నిపుణుల సూచన.
బంగారంపై ఎంత పెట్టుబడి పెట్టుకోవచ్చు? అన్న సందేహం వస్తుంది. తమ మొత్తం పెట్టుబడుల్లో 10-15 శాతాన్ని బంగారానికి కేటాయించుకోవచ్చు. దీనివల్ల దీర్ఘకాలంలో మెరుగైన రాబడికితోడు, పెట్టుబడుల్లో ఇతర విభాగాల నుంచి వచ్చే కుదుపులను తట్టుకునేందుకు సపోర్ట్ గా ఉంటుంది.
బంగారానికి ఇంత శాతం కేటాయించాలని నిర్ణయించుకున్న అనంతరం ఏ రూపంలో ఇన్వెస్ట్ చేయాలన్న సందేహం రావచ్చు. ఆర్బీఐ జారీ చేసే సార్వభౌమ బంగారం బాండ్లు అత్యంత అనుకూలం. 8 ఏళ్ల కాల వ్యవధి కలిగిన ఈ సాధనంలో ఏటా 2.5 శాతం వడ్డీగా చెల్లిస్తారు. కాల వ్యవధి తర్వాత బంగారం మార్కెట్ రేటు ప్రకారం చెల్లింపులు చేస్తారు.