Team India: తిరిగి ఫామ్లోకి ఎలా రావాలో కోహ్లీకి తెలుసంటున్న శ్రీలంక మాజీ కెప్టెన్
- కొన్నాళ్లుగా పేలవ ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీ
- ఇంగ్లండ్ పర్యటన తర్వాత విశ్రాంతి తీసుకున్న మాజీ కెప్టెన్
- ఈ నెల 27 నుంచి జరిగే ఆసియా కప్ తో తిరిగి బరిలోకి
- కోహ్లీ పుంజుకుంటాడన్న మహేల జయవర్ధనే
అంతర్జాతీయ క్రికెట్లో తన పేలవ ఫామ్ కు అడ్డుకట్ట వేసి.. తిరిగి పుంజుకోవడం ఎలాగో విరాట్ కోహ్లీకి తెలుసని శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే అభిప్రాయపడ్డాడు. అందుకు అవసరమైన అస్త్రాలు కోహ్లీ దగ్గర ఉన్నాయన్నాడు. కోహ్లీ కొంతకాలంగా వరసగా విఫలం అవుతూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. 2019 తర్వాత ఏ ఫార్మాట్ లోనూ సెంచరీ చేయలేదు.
ఇంగ్లండ్ పర్యటనలో శుభారంభాలు దక్కినప్పటికీ వాటిని మంచి స్కోర్లుగా మలచడడంలో విఫలమయ్యాడు. ఆ తర్వాత తను వెస్టిండీస్ పర్యటనకు వెళ్లలేదు. అలాగే, జింబాబ్వే టూర్ కు వెళ్తున్న భారత జట్టుకు కూడా దూరంగా ఉన్నాడు. ఈ నెల 27 నుంచి యూఏఈ వేదికగా జరిగి ఆసియా కప్ టీ20 టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టుకు విరాట్ ఎంపికయ్యాడు. 28న పాకిస్థాన్ తో జరిగే తొలి మ్యాచ్ లో అతను తిరిగి బరిలోకి దిగబోతున్నాడు.
ఈ క్రమంలో కోహ్లీ ఫామ్ గురించి జయవర్ధనే మాట్లాడాడు. భారత బ్యాటర్ తిరిగి ఫామ్లోకి వస్తాడనే నమ్మకం వ్యక్తం చేశాడు. ‘ప్రస్తుతం విరాట్ ఎదుర్కొంటున్న పరిస్థితి దురదృష్టకరం. కానీ అతను నాణ్యమైన ఆటగాడు. పేలవ ఫామ్ నుంచి బయటపడటానికి విరాట్ దగ్గర సాధనాలు ఉన్నాయని నేను నమ్ముతున్నాను. గతంలో కూడా ఇలాంటి పరిస్థితుల నుంచి అతను పుంజుకున్నాడు. కాబట్టి ఇప్పుడు కూడా అలాగే చేస్తాడన్న నమ్మకం వుంది. క్లాస్ శాశ్వతం, ఫామ్ తాత్కాలికం’ అని జయవర్దనే పేర్కొన్నాడు.