JDU: ఎనిమిదో సారి బీహార్ సీఎంగా ప్రమాణం చేసిన నితీశ్ కుమార్...రెండో సారి డిప్యూటీ సీఎంగా తేజస్వీ యాదవ్
- నిన్ననే ఎన్డీఏ నుంచి తొలగి సీఎం పదవికి రాజీనామా చేసిన నితీశ్
- తాజాగా బీహార్‌కు ఎనిమిదో సారి సీఎంగా ప్రమాణం చేసిన జేడీయూ చీఫ్
- మరోమారు నితీశ్ కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా చేరిన తేజస్వీ
బీహార్‌లో బుధవారం మధ్యాహ్నం కొత్త సర్కారు కొలువుదీరింది. జేడీయూ అధినేత, బీహార్ తాజా మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కొత్తగా సీఎంగా పదవీ ప్రమాణం చేశారు. బీహార్‌కు సీఎంగా పదవీ ప్రమాణం చేయడం నితీశ్‌కు ఇది ఎనిమిదోసారి. ఇక బీహార్ డిప్యూటీ సీఎంగా రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) కీలక నేత తేజస్వీ యాదవ్ ప్రమాణం చేశారు. బీహార్‌కు డిప్యూటీ సీఎంగా తేజస్వీ పదవీ బాధ్యతలు చేపట్టడం ఇది రెండో సారి. గతంలో నితీశ్ కేబినెట్‌లోనే డిప్యూటీ సీఎంగా కొనసాగిన తేజస్వీ... జేడీయూతో విభేదాల కారణంగా పదవీ బాధ్యతలు చేపట్టిన కొన్నాళ్లకే ఆయన రాజీనామా చేశారు.
మొన్నటిదాకా బీహార్ సీఎంగా కొనసాగిన నితీశ్.. తాజాగా బీజేపీతో తెగదెంపులు చేసుకొని, ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగి, మహాఘట్ బంధన్‌లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. మంగళవారం గవర్నర్ ఫాగు చౌహాన్‌కు తన రాజీనామాను సమర్పించిన నితీశ్.. తనకు మద్దతుగా నిలిచిన 164 మంది ఎమ్మెల్యేల జాబితాను కూడా అందజేశారు. బీహార్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమకు 7 పార్టీలు మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. ఇదిలా ఉంటే... తమకు మద్దతు ఇస్తున్న ఇతర పార్టీల సభ్యులకు కూడా నితీశ్ తన కేబినెట్‌లో మంత్రి పదవులు ఇవ్వనున్నట్లు సమాచారం.