SC Reservations: ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వానికి, ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు
- ఎమ్మార్పీఎస్ తాజా పిటిషన్
- వర్గీకరణపై శాశ్వత తీర్పు ఇవ్వాలన్న ఎమ్మార్పీఎస్
- విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు
- న్యాయం జరుగుతుందని భావిస్తున్నామన్న మంద కృష్ణ
ఎస్సీ వర్గీకరణ అంశంపై ఎమ్మార్పీఎస్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణకు అనుమతి ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ పిటిషన్ దాఖలు చేసింది. ఎస్సీ వర్గీకరణపై శాశ్వత తీర్పు ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. దీనిపై సీజేఐ ఎన్వీ రమణ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వానికి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. 2004లో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి సిఫారసు చేసింది.
కాగా, ఎమ్మార్పీఎస్ తాజా పిటిషన్ నేపథ్యంలో మంద కృష్ణ స్పందించారు. రెండు దశాబ్దాలుగా రిజర్వేషన్లు లేక నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరామని తెలిపారు. వర్గీకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని కోరామని, కేంద్ర, రాష్ట్రాల వైఖరులు తెలుసుకుంటామని న్యాయస్థానం తెలిపిందని మంద కృష్ణ వివరించారు. ఎస్సీ వర్గీకరణ జరిగితేనే ఉపకులాలకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. తమకు సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని నమ్మకం వ్యక్తం చేశారు.