AAP: 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ.వెయ్యి.. గుజరాత్ లో ఆప్ గెలిస్తే ఇస్తామన్న కేజ్రీవాల్
- ఇది తాయిలం కాదని.. ప్రజల సొమ్ము ప్రజలకే చేరాలని వ్యాఖ్య
- నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేలు భృతిగా అందజేస్తామని ప్రకటన
- ఇప్పటికే పేదలకు నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ
గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తే ఆ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ. వెయ్యి చొప్పున అందజేస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. గుజరాత్ లో ఆప్ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్న కేజ్రీవాల్.. ఇటీవల వరుసగా హామీలు ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పటికే పేదలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని, గుజరాత్ లోని నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతిగా అందజేస్తామని హామీ ఇచ్చారు. తాజాగా మహిళలను ఆకట్టుకునే మరో ఎన్నికల హామీని ప్రకటించారు.
ఈ సొమ్ము మీ హక్కు..
గుజరాత్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా కేజ్రీవాల్ బుధవారం సమావేశం నిర్వహించారు. ‘‘గుజరాత్ రాష్ట్రంలో ఆప్ అధికారంలోకి వస్తే.. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,000 అలవెన్స్ గా అందజేస్తాం. ఇదేదో తాయిలం కాదు.. ఇది మీ హక్కు. ప్రజల సొమ్ము తిరిగి ప్రజలకే చేరాలి. స్విస్ బ్యాంకుల్లోకి కాదు..” అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
గుజరాత్ లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ముందుగానే రంగంలోకి దిగి ఆప్ విజయం కోసం బాటలు వేస్తున్నారు.