Chess Olympiad: 9 నెలల గర్భంతో కాంస్యం నెగ్గిన హారిక... గ్రీటింగ్స్ చెప్పిన సినీ దర్శకుడు బాబీ
- తమిళనాడులో ముగిసిన చెస్ ఒలింపియాడ్
- 9 నెలల గర్భిణీగా ఉంటూ పోటీలకు హాజరైన హారిక
- కాంస్య పతకాన్ని సాధించిన చెస్ క్రీడాకారిణి
- హారిక ఫొటోను పోస్ట్ చేసిన దర్శకుడు బాబీ
భారత చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక తమిళనాడులో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో కాంస్య పతకం నెగ్గింది. ఇప్పటికే ఇలాంటి పలు పతకాలను నెగ్గిన హారికకు తాజా పతకం మాత్రం తన జీవితంలో గుర్తిండిపోయేదని చెప్పాలి. ఎందుకంటే... 9 నెలల గర్భిణీగా ఉన్నా కూడా హారిక చెస్ ఒలింపియాడ్‌లో పాల్గొని, ఆమె పతకం సాధించింది.
ఈ విషయాన్ని హారిక బావ, టాలీవుడ్ దర్శకుడు బాబీ సోషల్ మీడియా వేదికగా బుధవారం వెల్లడించారు. 9 నెలల గర్భంతో మెడలో తాను గెలిచిన పతకాన్ని వేసుకుని హారిక తీయించుకున్న ఫొటోను పోస్ట్ చేసిన బాబీ... చెస్ పట్ల ఆమెకున్న అంకితభావాన్ని కీర్తించారు. దేశం కోసం ఏదో సాధించాలన్న హారిక తపన, ఆమెలోని పోరాట పటిమ తనకు గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు.