Stone Age Tools: ప్రకాశం జిల్లాలో 2.47 లక్షల ఏళ్ల నాటి రాతి పనిముట్లు... కొత్త సిద్ధాంతానికి ఊపిరి
- 2018లో హనుమంతునిపాడు వద్ద తవ్వకాలు
- బయల్పడిన రాతి పనిముట్లు
- సైంటిఫిక్ డేటింగ్ ద్వారా పరిశోధన
- హోమోసెపియన్స్ కంటే ముందే ఆదిమ మానవులు ఉన్నారని వెల్లడి
హోమోసెపియన్స్ కంటే కొన్ని లక్షల సంవత్సరాల ముందే ఆంధ్రప్రదేశ్ లో ఆదిమ మానవులు జీవించారన్న విషయం వెల్లడైంది. ప్రకాశం జిల్లాలోని హనుమంతునిపాడు వద్ద లభ్యమైన రాతి పనిముట్లు 2.47 లక్షల ఏళ్ల నాటివని స్పష్టమైంది.
2018లో కనిగిరి సమీపంలోని పాలేరు నదీతీరంలో జరిపిన తవ్వకాల్లో ఇవి బయటపడ్డాయి. వడోదరకు చెందిన మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న దేవర అనిల్ కుమార్ నేతృత్వంలో ఈ తవ్వకాలు జరిపారు. ఈ పనిముట్లను అహ్మదాబాద్ లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబ్ లో సైంటిఫిక్ డేటింగ్ విధానంలో పరిశీలించారు. ఇవి 2.47 లక్షల ఏళ్ల నాటివని నిపుణులు తేల్చారు.
ఆధునిక మానవులు (హోమోసెపియన్స్) 1.22 లక్షల ఏళ్ల కిందట ఆఫ్రికా నుంచి భారత్ కు వలస వచ్చారని, వారు తమతో రాతి పనిముట్లు తెచ్చారని ఇప్పటివరకు అందరూ అంగీకరిస్తున్న సిద్ధాంతం. అయితే, అంతకుముందే ఇక్కడ ఆదిమ మానవులు సంచరించారన్నదానికి ప్రకాశం జిల్లాలో లభ్యమైన లక్షల ఏళ్ల నాటి రాతి పనిముట్లే నిదర్శనం. వీటిని నాటి హోమో ఎరక్టస్ జాతి ఆదిమమానవులు వినియోగించి ఉంటారని భావిస్తున్నారు. తద్వారా హోమోసెపియన్స్ సిద్ధాంతం తెరమరుగమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.