Raj Nath Singh: అమిత్ షాను ప్రజలు వేరుగా అర్థం చేసుకోవడానికి కారణం ఇదే: రాజ్ నాథ్ సింగ్
- అమిత్ షా ఎంతో గంభీరంగా ఉంటారు
- వివిధ రంగాలను ఆయన అధ్యయనం చేసే తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది
- ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ లపై ఆయన చేసిన ప్రసంగాలు అద్భుతం
రాజకీయం, ఆధ్యాత్మికత రెండూ కలగలిసిన అరుదైన వ్యక్తిత్వాన్ని కలిగిన వ్యక్తి అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రశంసలు కురిపించారు. వివిధ సందర్భాల్లో అమిత్ షా చేసిన ప్రసంగాలతో ముద్రించిన 'శబ్దాంశ్' అనే పుస్తకాన్ని రాజ్ నాథ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అమిత్ షా ఎంతో గంభీరంగా ఉంటారని... పేరు కోసం పాకులాడకుండా, అప్పగించిన పనులను చిత్తశుద్ధితో చేస్తారని కొనియాడారు. తెర వెనుక ఉంటూనే... పార్టీ కోసం, ప్రభుత్వం కోసం ఆయన నిర్విరామంగా పని చేస్తారని చెప్పారు. గంభీరంగా ఉండటం వల్ల అమిత్ షా వంటి వ్యక్తులను ప్రజలు వేరుగా అర్థం చేసుకుంటుంటారని అన్నారు.
వివిధ రంగాలను అధ్యయనం చేసేందుకు ఆయన సమయాన్ని కేటాయించే తీరు తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటుందని రాజ్ నాథ్ అన్నారు. ఆయన జీవితమే ఒక ప్రయోగశాల అని కితాబునిచ్చారు. జీవితంలో అనేక నెలలు జైల్లో గడిపినా... చివరకు నిర్దోషిగా బయటకు వచ్చారని చెప్పారు. దర్యాప్తు సంస్థలు పిలిచినప్పుడల్లా వెళ్లారని... ఏ రోజు కూడా రాద్ధాంతం చేయలేదని అన్నారు. కొందరు రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్న తీరుతో... రాజకీయ నాయకులను ప్రజలు వేరుగా చూసే పరిస్థితి నెలకొందని... ఈ పరిస్థితిని మార్చేందుకు అమిత్ షా కృషి చేస్తున్నారని చెప్పారు.
పార్లమెంటులో ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ లపై అమిత్ షా చేసిన ప్రసంగాలు అద్భుతమని రాజ్ నాథ్ కొనియాడారు. విపక్ష సభ్యులను సైతం ఆ ప్రసంగాలు ఆకట్టుకున్నాయని చెప్పారు. 'శబ్దాంశ్' పుస్తకం రాబోయే తరాలకు ఒక దీప స్తంభంలా నిలుస్తుందని అన్నారు.