Economy: ఎన్నికల ఉచిత తాయిలాలు ‘తీవ్రమైన అంశమే’: సుప్రీంకోర్టు
- రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయన్న ధర్మాసనం
- వాటిని వినాల్సి ఉందని వ్యాఖ్య
- ఆగస్ట్ 17న తదుపరి విచారణ
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఓటర్లకు ప్రకటిస్తున్న ఉచిత తాయిలాలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. దీన్ని తీవ్రమైన అంశంగా పేర్కొంది. వీటి కారణంగా ఆర్థిక వ్యవస్థ ఎంతో ధనాన్ని నష్టపోతోందని వ్యాఖ్యానించింది. ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు ఉచిత ప్రయోజనాలు ప్రకటించకుండా నిషేధించాలని కోరుతూ న్యాయవాది అశ్వని ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేయగా.. దీనిపై విచారణ కొనసాగుతోంది.
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు చేసే ప్రకటనలకు వాటిని జవాబుదారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోర్టును కోరారు. ‘‘ఇది తీవ్రమైన అంశం. కాదని ఎవరూ అనరు. ఉచిత ప్రయోజనాలు పొందుతున్న వారు, అవి కావాలని, తమది సంక్షేమ రాజ్యమని భావిస్తుంటారు. కొందరు తాము పన్నులు చెల్లిస్తున్నామని, దీన్ని అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాలని కోరుతుంటారు. కనుక రెండు వైపుల వారి అభిప్రాయాలను కమిటీ వినాలి’’ అని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం వ్యాఖ్యలు చేసింది.
భారత దేశంలో పేదరికం ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ, పేదల ఆకలి తీర్చే ప్రణాళికలతో కేంద్ర ప్రభుత్వం ఉన్న విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. ఆర్థిక వ్యవస్థకు నష్టం కలుగుతున్న దృష్ట్యా ప్రజల సంక్షేమాన్ని కూడా తటస్థంగా చూడాలని పేర్కొంటూ.. విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.