Telangana: తెలంగాణ ఎంసెట్ ఫలితాల విడుదల.. స్కోర్ కార్డులను ఇలా డౌన్ లోడ్ చేసుకోవచ్చు!
- ఎంసెట్ ఫలితాలను విడుదల చేసిన మంత్రి సబిత
- ఇంజినీరింగ్ లో 80.41 శాతం, అగ్రికల్చర్ లో 88.34 శాతం ఉత్తీర్ణత
- త్వరలోనే కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తామన్న మంత్రి
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్టీయూ ప్రాంగణంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఎంసెట్ ఫలితాలతో పాటు ఫైనల్ ఆన్సర్ కీ కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ... ఇంజినీరింగ్ లో 80.41 శాతం, అగ్రికల్చర్ లో 88.34 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఎంసెట్ లో ఉత్తీర్ణత సాధించిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
త్వరలోనే ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని... కళాశాలల వివరాలు, కోర్సుల వివరాలు కౌన్సిలింగ్ సెంటర్ లో వెల్లడిస్తారని తెలిపారు. మరోవైపు ఇంజినీరింగ్ పరీక్షకు 1,56,812 మంది... అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల పరీక్షలకు 80,575 మంది హాజరయ్యారు.
ఎంసెట్ ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే..
- eamcet.tsche.ac.in వెబ్ సైట్ లోకి లాగిన్ అవ్వాలి
- హోం పేజ్ లో కనిపించే స్కోర్ కార్డ్ పై క్లిక్ చేయాలి
- లాగిన్ వివరాలను నమోదు చేసి, సబ్మిట్ చేయాలి
- వెంటనే ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తాయి
- ఆ ఫలితాలను సేవ్ చేసుకోవచ్చు లేదా ప్రింట్ ఔట్ తీసుకోవచ్చు.