YSRCP: సుప్రీంకోర్టులో వైఎస్ సునీతా రెడ్డి పిటిషన్... వివేకా కేసు దర్యాప్తులో పురోగతి లేదని ఫిర్యాదు
- వివేకా కేసుపై సుప్రీంకోర్టులో సునీతా రెడ్డి పిటిషన్
- నిందితులే దర్యాప్తు అధికారులపై కేసులు పెడుతున్నారని ఆరోపణ
- సునీత పిటిషన్ను ప్రస్తావిస్తూ టీడీపీ పోస్టులు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వ్యవహారం శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గడప తొక్కింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు.. కేసులో ఏమాత్రం పురోగతి సాధించలేకపోతున్నారని ఆరోపిస్తూ వివేకా కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారే దర్యాప్తు అధికారులపై కేసులు పెడుతున్నారంటూ ఆమె తన పిటిషన్లో ప్రస్తావించారు.
సుప్రీంకోర్టులో సునీతా రెడ్డి పిటిషన్ వేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ టీడీపీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో కొన్ని పోస్టులు పెట్టింది. 'రాఖీ పండుగ నాడే, న్యాయం కోసం ఓ చెల్లెలి పోరాటం' అంటూ కామెంట్ చేసిన టీడీపీ... 'అన్న పాలనలో నిజం బయటకు రాదా?' అని ప్రశ్నించింది. తన అన్న పాలన పైనే వైఎస్ సునీత ఫిర్యాదు చేశారంటూ టీడీపీ అందులో పేర్కొనడం గమనార్హం.