Salman Rushdie: ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై న్యూయార్క్ లో దాడి
- ఓ కార్యక్రమంలో పాల్గొన్న రష్దీ
- ప్రసంగించబోతుండగా దూసుకొచ్చిన వ్యక్తి
- ఒక్కసారిగా రష్దీపై విరుచుకుపడిన వైనం
- కిందడిపోయిన రష్దీ
- ఆగంతుకుడ్ని పట్టుకున్న నిర్వాహకులు
ముస్లిం ఛాందసవాదుల నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్న ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై న్యూయార్క్ లో దాడి జరిగింది. ఇక్కడి చౌటాక్వా విద్యాసంస్థలో ఆయన ప్రసంగించబోతుండగా, ఒక్కసారిగా వేదికపైకి దూసుకొచ్చిన ఆగంతుకుడు ఆయనపై దాడి చేశాడు. దాంతో సల్మాన్ రష్దీ కిందపడిపోయారు.
ఈ ఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్న అసోసియేటెడ్ ప్రెస్ రిపోర్టర్ దీనిపై స్పందిస్తూ, ఆ వ్యక్తి వేదికపైకి వెళ్లి రష్దీపై పిడిగుద్దుల వర్షం కురిపించడమో, కత్తితో పొడవడమో చేశాడని వెల్లడించారు. ఈ ఘటన అనంతరం ఆ వ్యక్తిని అక్కడున్నవారు దొరకబుచ్చుకున్నారు. రష్దీని ఓ హెలికాప్టర్ లో ఆసుపత్రికి తరలించారు.
80వ దశకంలో సల్మాన్ రష్దీ రచించిన 'ద శాటానిక్ వర్సెస్' అనే పుస్తకం వివాదాస్పదమైంది. ఇస్లామిక్ ఛాందసవాదులను ఈ పుస్తకం తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. రష్దీ దైవదూషణకు పాల్పడ్డాడంటూ అతడిపై నిప్పులు చెరిగారు. ఈ నేపథ్యంలో, రష్దీపై ఇరాన్ నేత అయతుల్లా ఖొమేనీ ఫత్వా కూడా విధించారు. రష్దీని చంపినవారికి ఇరాన్ 3 మిలియన్ డాలర్ల నజరానా ప్రకటించింది.