Revanth Reddy: కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి సారీ చెబుతూ రేవంత్ వీడియో రిలీజ్
- హోంగార్డు ప్రస్తావన, అద్దంకి దయాకర్ వ్యాఖ్యలపై బేషరతు క్షమాపణ కోరిన రేవంత్
- తదుపరి చర్యల కోసం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కు సూచన చేసినట్టు వెల్లడి
- ఇలాంటి భాష ఎవరికీ మంచిది కాదన్న పీసీసీఐ అధ్యక్షుడు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పారు. ఈ మేరకు ఓ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ‘ఈ మధ్య పత్రికా సమావేశంలో హోం గార్డ్ ప్రస్తావన, చండూరు బహిరంగ సభలో అద్దంకి దయాకర్.. వెంకట్ రెడ్డి గారిని ఉద్దేశించి పరుషమైన పదజాలం వాడటంతో ఆయన ఎంతో మనస్తాపానికి గురయ్యారు. పీసీసీ అధ్యక్షుడిగా క్షమాపణ చెప్పాలని ఆయన నన్ను డిమాండ్ చేశారు. కాబట్టి ఆయనకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నా' అన్నారు.
'ఇలాంటి చర్యలు, ఇలాంటి భాష ఎవరికీ మంచిది కాదు. తెలంగాణ ఉద్యమంలో, రాష్ట్ర సాధనలో అత్యంత క్రియాశీల పోషించిన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారిని ఇలా అవమానించేలా ఎవరూ మాట్లాడటం సరికాదు. తదుపరి చర్యల కోసం క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి గారికి సూచన చేశా’ అని రేవంత్ సదరు వీడియోలో పేర్కొన్నారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాబోయే ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే, తాను మునుగోడు ఎన్నిక ప్రచారానికి వెళ్లేది లేదని వెంకట్ రెడ్డి ప్రకటించారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత చండూరులో నిర్వహించిన పార్టీ సమావేశానికి తనకు ఆహ్వానం అందలేదన్నారు. పైగా, సభలో సొంత పార్టీ నేతలతోనే తనను తిట్టించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చండూరు సభలో తనను తిట్టించిన రేవంత్ రెడ్డి తనకు క్షమాపణ చెప్పాలని వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.