Freedom Rally: కాల్పులు జరిపిన మంత్రిని బర్తరఫ్ చేయాలి.. తుపాకీ ఇచ్చిన ఎస్పీని సస్పెండ్ చేయాలి: బీజేపీ నేత డీకే అరుణ
- ఫ్రీడమ్ ర్యాలీలో పోలీసు తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపిన శ్రీనివాస్ గౌడ్
- ఘటనపై వేగంగా స్పందించిన బీజేపీ నేత డీకే అరుణ
- మంత్రి చర్య బాధ్యతారహితమేనని ఆరోపణ
- మంత్రి, ఎస్పీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఫ్రీడమ్ ర్యాలీలో భాగంగా మహబూబ్ నగర్లో నిర్వహించిన కార్యక్రమంలో పోలీసు తుపాకీని తీసుకుని గాలిలోకి కాల్పులు జరిపిన తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యవహారంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ స్పందించారు. భారీ సంఖ్యలో జనం హాజరైన కార్యక్రమంలో ఓ మంత్రి స్థాయిలో ఉన్న శ్రీనివాస్ గౌడ్ పోలీసు తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరపడం బాధ్యతారహితమేనని ఆమె అభిప్రాయపడ్డారు.
బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి జనం చూస్తుండగానే గాల్లోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను తక్షణమే మంత్రి మండలి నుంచి బర్తరఫ్ చేయాలని అరుణ డిమాండ్ చేశారు. అంతేకాకుండా తనకు జిల్లా ఎస్పీనే తుపాకీ ఇచ్చారని మంత్రి చెప్పిన విషయాన్ని ప్రస్తావించిన అరుణ... మంత్రికి తుపాకీ ఇచ్చిన ఎస్పీపై క్రమశిక్షణ చర్యలు తీసుకుని.. ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.